మక్తల్, ఆగస్టు 21 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీచేసిన ఉదంతం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్‌లో వెలుగుచూసింది. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం రైతుల నుంచి భూములు సేకరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.14లక్షల పరిహారం ఇస్తే తీసుకోబోమని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి న్యాయమైన పరిహారం ఇస్తేనే తమ భూములు ప్రభుత్వానికి ఇస్తామని తేల్చిచెప్పారు. భూములు కోల్పోతున్న రైతులు భూసేకరణకు సంబంధించిన నోటీసులు తీసుకోకపోవడంతో వారిని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గురువారం కాచ్‌వార్‌కు వెళ్లి రైతుల వ్యక్తిగత వివరాలు సేకరించి వారి మొబైల్ ఫోన్‌కు అధికారులు వాట్సాప్ ద్వారా బలవంతంగా నోటీసులు అందజేశారు.