హైదరాబాద్ నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు కావస్తున్నా రెగ్యులర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పోస్టు ఏర్పాటు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో నాలుగు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని బుధవారం ఆదేశించింది. డీఎంఈ పోస్టు నియామక వ్యవహారంపై వనపర్తి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఏ నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.