
వడ్లు కొననంటే రైతులు ఎటు పోవాలే?: సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో పంటల బీమా పథకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో శాస్త్రీయత లేదని చెప్పారు. దేశంలో పంట నష్టపోయిన ఏ రైతుకు బీమాతో న్యాయం జరగడంలేదన్నారు. ఫసల్ బీమా మరే బీమా అయినా అన్నీ బోగసేనని విమర్శించారు. పంటల బీమా పథకాలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుదామన్నారు. కేంద్రం విచిత్ర వైఖరితో ఫసల్ బీమాను రైతులు తీసుకోవడమే మానేశారని, తమను దోచి ఇన్సూరెన్స్ కంపెనీలకు పెడుతున్నదని భావిస్తున్నారని తెలిపారు. గతేడాది హైదరాబాద్లో వరదొలిచ్చి బాగా నష్టం జరిగినప్పుడు రూ.8 వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపితే.. 8 రూపాయలు కూడా ఇవ్వలేదని సీఎం విమర్శించారు. ‘వడ్లు, గోధుమల నిల్వలు ఎక్కువైనయి.. ఇగ వడ్లు కొనబోమని కేంద్రం అంటే రైతులు, రాష్ట్రప్రభుత్వాలు ఏం చేయాలే? మా దగ్గర ధాన్యం నిల్వలు ఎక్కువైనయి.. ఇగ వడ్లు కొనబోమని కేంద్రం చేతులెత్తేస్తున్నది. మరి రైతులు ఎటు పోవాలే? మీది కరెక్ట్ పద్ధతి కాదని కేంద్రానికి చెప్పిన. నాట్లు పడిన తర్వాత కోతల సమయంలో ఎంవోయూ అంటే ఇది అశాస్త్రీయం. ఈ విధానం మంచిది కాదు.. మార్చాలని చెప్పిన. దానిపై వాళ్లు ఏదో చేస్తున్నారు’ అని సీఎం తెలిపారు. గులాబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు వందశాతం న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.