హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ తమిళిసై గవర్నర్‌లా కాకుండా బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అది రాజ్‌భవన్ కాదు.. బీజేపీ భవన్ అని ధ్వజమెత్తారు. రాష్ట్ర శాసనసభ పంపిన బిల్లులను ఆమోదించడానికి కాలపరిమితి లేదని, ఎంత కాలమైనా ఆపుతామని తమిళిసై వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో గవర్నర్ సుప్రీం కాదన్నారు. యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుపై అభ్యంతరాలు ఉంటే, మిగతా బిల్లులను గవర్నర్ ఎందుకు తొకి పెట్టారని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలనే లక్ష్యంతో గవర్నర్ పనిచేస్తున్నట్టు ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై మంత్రులు తన వద్దకు వచ్చి సమాధానం చెప్పాలనడం అహంకార ధోరణికి నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో సౌకర్యాలు లేవని చెబుతున్న గవర్నర్.. చాన్స్‌లర్‌గా ఉంటూ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకొన్నారని నిలదీశారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు బీజేపీ మూలాలు ఉన్న వ్యక్తులను చాన్స్‌లర్, వైస్‌చాన్స్‌లర్లుగా నియమిస్తూ రాజకీయ జోక్యానికి పాల్పడుతున్నారన్నారు.
రాజ్‌భవన్‌కు కాకుండా విద్యార్థులు ప్రగతిభవన్ వద్ద నిరసన తెలపాలని గవర్నర్ అనడం సరైనది కాదని, తన ఫోన్ కూడా ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గవర్నర్ వైఖరి వల్ల యూనివర్సిటీల్లో దాదాపు 5 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచి నిరుద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కూనంనేని చెప్పారు. ఇప్పటికైనా పేచీలు పెట్టడం మానేసి హుందాగా వ్యవహరించాలని సూచించారు.