U Sitting | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : పాఠశాలల్లో విద్యార్థులను ‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టడమనే కొత్త విధానం తెరపైకి వచ్చింది. విద్యార్థులను ఇలా కూర్చోబెట్టడం మంచిదా? కాదా..? అన్న చర్చ నడుస్తున్నది. ఈ విధానాన్ని కొందరు టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని అంటున్నారు. దీన్ని తొలుత కేరళలోని కొన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. మళయాల సినిమా ‘స్థానార్థి శ్రీకుట్టన్’ ‘యూ’ టైపు సీటింగ్ ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది.
ఈ సినిమా నుంచి స్ఫూర్తి పొంది, తమిళనాడులో తొలుత పైలెట్ పద్ధతిలో అమలుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. బ్యాక్ బెంచ్, ఫ్రంట్ బెంచ్ అనే ఆలోచనను తీసేసేందుకు దీనిని చేసింది. ఈ ట్రెండ్ మన దగ్గరికి పాకి ంది. హైదరాబాద్, జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ‘యూ’ ఆకారంలో విద్యార్థులను కూర్చోబెట్టేందుకు యంత్రాంగం ఆదేశాలిచ్చింది.
తరగతి గదిలో ‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టినప్పుడు బ్లాక్బోర్డుకు ఎదురుగా ఉన్న విద్యార్థులను మినహాయిస్తే కుడి, ఎడమ వైపు ఉన్న వారు ఏకధాటిగా 6-7 గంటలపాటు మరో వైపు మెడను తిప్పి చూడాల్సి వస్తుంది. ప్రతి రోజు చూడాల్సి రావడం ఇబ్బందికరమని కొందరు ఉపాధ్యాయులు అంటున్నారు. కొందరు విద్యార్థులు బ్లాక్ బోర్డును సూటిగా చూడలేరు. కొంత మంది బోర్డును చూడటానికి తమ మెడను ఎడమ, లేదా కుడి వైపు తిప్పాలి.
ఇలా కూర్చుండబెట్టడం మెడనొప్పికి దారితీస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు. సహజంగా తరగతి గదులు 20 అడుగుల పొడవు, వెడల్పు ఉంటాయి. ‘యూ’ ఆకారంలో కూర్చుంటే 20-24 మంది మాత్రమే పడతారు. అంతకంటే ఎక్కువ విద్యార్థులుంటే కూర్చోబెట్టడం సాధ్యంకాదు. తరగతి గదిలో 25 మందిలోపు ఉంటేనే ‘యూ’ ఆకారపు సీటింగ్ అమలు సులభమవుతుంది. తమిళనాడులోని కొన్ని పాఠశాలల్లో మెడనొప్పికి దారితీయడంతో ప్రతి పీరియడ్‌కు విద్యార్థులు కూర్చుండే స్థానాన్ని మార్చుతున్నారని టీచర్లు ఉదహరిస్తున్నారు.
యూ’ ఆకారం సీటింగ్ విషయంలో తొందరపాటు వద్దు. ఆచరణకు ముందు సమగ్రంగా ఆలోచించాలి. కొన్ని పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి, ఫలితాలను సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. కర్ణాటకలో కొందరు డాక్టర్లు వ్యతిరేకించినట్టు తెలిసింది. అవసరమైతే అమలు చేసే ముందే డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.
– రాజభాను చంద్రప్రకాశ్, హెచ్ఎం అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
టీచర్‌కు విద్యార్థులంతా సమానమే. ముందు బెంచీ, చివరి బెంచీ అన్న తేడాలుండవు. బ్యాక్ బెంచర్లు ఎందరో సూపర్ హీరోలైన వారున్నారు. బ్యాక్ బెంచీ, ఫ్రంట్ బెంచీ అన్న ఆలోచననే దుర్మార్గం. ఒక సినిమాలో చూపించిన దానిని ప్రామాణికంగా తీసుకుని అమలు చేయాలనుకోవడం సరికాదు. ‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టడం వల్ల విద్యార్థులు శాశ్వతంగా వెన్నుపూస నొప్పి, మెడనొప్పి బారినపడే అవకాశమున్నది.
– మామిడోజు వీరాచారి, టీచర్
‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టడంతో విద్యార్థులంతా సమానమనే భావన ఏర్పడుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇలా కూర్చోబెట్టడం అన్ని పాఠశాలల్లో సాధ్యపడదు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టలేం. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలొస్తాయి. తరగతి గదిలో 20 మంది ఉంటేనే ఈ విధానం సులభమవుతుంది.
– కటకం రమేశ్, టీఆర్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు