Telangana | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆయనో ఉన్నత ర్యాంకు కలిగిన ఐపీఎస్ ఆఫీసర్. ‘సందులో సడేమియా’ అన్న చందంగా సైలెంట్‌గా పనులు చేసుకుంటూ పోతారు. అవకాశం దొరికితే చాలు.. అధికార పార్టీ కీలక నేతలకు ఎవరు దగ్గర ఉంటారో తెలుసుకొని, వారిని ప్రసన్నం చేసుకొని, వారి ద్వారా అసామాన్య పనులు చేయించుకోవడంలో ఆయనది అందెవేసిన చెయ్యి! అదేస్థాయిలో ఆయా నేతలు చెప్పిన ‘ఏ పనైనా’ ఇట్టే చేసి పెట్టడం ఈయనకు అనుభవంతో వచ్చిన విద్య! ఇన్నాళ్లూ బయటి ప్రపంచానికి తెలియకుండానే పనులు చక్కదిద్దిన ఆయన.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జూలు విదిల్చారన్న విమర్శలున్నాయి. ఏకంగా బిగ్ బ్రదర్స్‌ను ప్రసన్నం చేసుకోవడం.. వారి దీవెనలు మెండుగా అందడంతో ఆయన కూడా కబ్జాకోరులకు దండిగా ఆశీస్సులిస్తున్నట్టు బాహాటంగానే చర్చ నడుస్తున్నది.
ఉద్యోగ చరమాంకంలో అపఖ్యాతి..
‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అనే చందంగా ఆ ఐపీఎస్ అధికారి తన కెరీర్ చివరి దశలో అక్రమాలకు తెగపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనకు దీవెనలు అందిస్తున్న బిగ్ బ్రదర్స్ కోసం, పోస్టింగ్ ఇప్పించిన ‘బావల కండ్లలో ఆనందం’ కోసం ఆయన నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకొని బాధితులనే బెదిరిస్తూ అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారనే వాదనలున్నాయి. ఇన్నాళ్లూ తన కెరీర్లో అవకాశం దొరికినప్పుడల్లా అడ్డదారుల్లో దండుకున్న ఆ అధికారి, ఇప్పుడు నేరుగానే రంగంలోకి దిగినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం నడిబొడ్డున మల్కాజ్‌గిరిలోని 26 ఎకరాల స్థలంలో అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ నేటికీ ఆ ఐపీఎస్ అధికారి ప్రవర్తిస్తున్న తీరును చూసి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరికి చెందిన ఓ కీలక కాంగ్రెస్ నేతతో చేతులు కలిపి.. వారి ద్వారా బిగ్ బ్రదర్స్ ఆగడాలకు వంతపాడుతున్న ఆ ఐపీఎస్ అధికారి చేష్టలను ఇటు పోలీస్ బాస్ కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.
ఒత్తిళ్లు తట్టుకోలేక రెవెన్యూ సైడ్
గుర్రంపోడు భూముల విషయంలో బిగ్ బ్రదర్స్ రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలే స్థానిక రెవెన్యూ అధికారులు ఆ ఇష్యూ నుంచి సైలెంట్‌గా సైడ్ అయిపోయారు. తమ వంతుగా పోలీసులకు ఫిర్యాదు చేసి పక్కకు తప్పుకొన్నారు. అయితే, ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ఐపీఎస్ అధికారి మాత్రం.. బిగ్ బ్రదర్స్ డైరెక్షన్లో పథకం ప్రకారం స్థానిక రైతులను బెదిరించి, వారితో కేసులు పెట్టించినట్టు తెలిసింది. అంతేకాకుండా ‘నమస్తే తెలంగాణ’ ప్రస్తావించిన బిల్డర్‌ది ఎలాంటి తప్పు లేదని ఆగమేఘాల మీద తన కిందిస్థాయి అధికారితో ప్రెస్నోట్లు ఇప్పించినట్టు తెలుస్తున్నది. బిగ్ బ్రదర్స్ అనుకూల మీడియా, వారి రిపోర్టర్లతో ‘నమస్తే తెలంగాణ’ మీద కేసు అయిన విషయాన్ని, పోలీసుల వివరణను ఆయా గ్రూపుల్లో చొరవ తీసుకొని మరీ పోస్టు చేయించడం వెనుక కూడా ఆ ఐపీఎస్ అధికారి హస్తం ఉన్నట్టు తెలిసింది.
ఖాళీగా కనిపిస్తే.. కబ్జాలే!
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరి, తిరుమలనగర్‌లో యథేచ్ఛగా ల్యాండ్‌మాఫియా విస్తరించిందని బాధితులు చెప్తున్నారు. మల్కాజిగిరిలోని కేసీఆర్ బస్తీలో ఓపెన్ ప్లాట్లు ఉంటే వాటిల్లో గోడలు కట్టి ఆక్రమించుకుంటున్నారని వాపోతున్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నేతలే ఈ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, వారికి ఆ ఐపీఎస్ అధికారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని తెలిసింది. ఆ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న భూ దందాలను ఓర్చుకోలేని ఓ డీసీపీ, పై అధికారులు, అధికార నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక లీవ్‌లో వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. మల్కాజ్‌గిరిలో భూదందాపై భూ యజమానులు పోలీసులను కలవడానికి ప్రయత్నించినప్పుడు వారికి పోలీసుల నుంచి విచిత్ర సమాధానాలు ఎదురయ్యాయని బాధితులు వాపోతున్నారు. తమ భూములను వేరేవాళ్లు కబ్జా చేశారంటూ లోకల్ సీఐని కలిసి ఫిర్యాదు చేస్తే పేపర్స్ అన్నీ పరిశీలించి తాను కొత్తగా వచ్చానని, అయినా ఈ విషయంలో మీది కరెక్టే అయినా తామేం చేయలేమని చేతులెత్తేశారని చెప్తున్నారు.
బావలు, బ్రదర్స్ కోసం ఇష్యూలు భుజాన
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘అడ్డం’ లేదన్నట్టుగా చెలరేగిపోతున్న ప్రజాప్రతినిధులైన అన్నదమ్ములకు ఈయన దగ్గరి చుట్టం.. వరసకు బామ్మర్ది కావడం గమనార్హం. తాను కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇప్పించడంలో బావలు సాయం చేస్తే.. అందుకు ప్రతిఫలంగా ఈ బామ్మర్ది తన అధికారాన్ని వారికోసం వినియోగిస్తున్నారు. మొన్నటి మల్కాజ్‌గిరిలో 26 ఎకరాల స్థలం వివాదం, గుర్రంగూడలో బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ ఇష్యూలను ‘వారి కండ్లలో ఆనందం’ కోసం ఆసాంతం తన భుజాల మీద వేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడం వెనుకా సదరు ఆఫీసర్‌కు అటు అడ్డం లేని అన్నదమ్ములు, ఇటు బిగ్ బ్రదర్స్ ప్రోత్సాహమే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
న్యాయం కోసం పోతే నామీదే కేసు
సార్.. మా 19 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొందరు వచ్చిండ్రని సీఐ దగ్గరికి పోయిన.. ల్యాండ్ మాదే అయినా ఆయన ఉల్టా నా మీదే కేసులు పెట్టిండ్రు. తీరా డాక్యుమెంట్లు అన్నీ చూసి తనకు హై లెవెల్లో ప్రెజర్ ఉన్నదని చెప్పిండ్రు. నేరుగా సీపీని కలువుమంటే నేను రాచకొండ సీపీ ఆఫీస్‌కు పోయిన. అక్కడ నన్ను చూసిన వెంటనే ‘మీరు బీఆర్ఎస్ నేతలంట కదా.. నీకు ల్యాండ్ ఎట్ల వస్తదో చూస్తా’ అని ఉల్టా నన్నే బెదిరించిండ్రు. నేను ఎంత ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. కావాలంటే సీపీ ఆఫీస్‌కు వెళ్లి నేను బతిమాలిన సీసీ ఫుటేజ్ మీరు తెప్పించుకోండి. ఆఖరికి ఆయన మల్కాజిగిరి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతురావును కలువుమని, ఆయన ద్వారా సీఎం బ్రదర్స్ అయిన తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డిని కలువుమని చెప్పిండ్రు. వాళ్లను నేనెందుకు కలువాలె అని అడిగితే.. గెట్ అవుట్ అని నన్ను వెళ్లగొట్టిండ్రు
– మల్కాజ్గిరి తిరుమల్‌నగర్ భూ బాధితుడు రాకేశ్‌రెడ్డి ఆవేదన
కబ్జాపై నిలదీస్తే దౌర్జన్యం చేస్తున్నరు
తిరుమల్నగర్లోని ఆర్టీసీకాలనీలో మాకు చెరో 80 గజాల చొప్పున 160 గజాల జాగ ఉన్నది. ఆ స్థలాన్ని ఎవరో ఆక్రమించుకుంటే ఇదేందని అడిగినందుకు దౌర్జన్యం చేస్తున్నరు. పోలీసులు పట్టించుకోవడం లేదు..
– బాధితురాలు సుంచె అరుణ ఆక్రందన
పోలీసులు పట్టించుకుంటలేరు
1968లో కోర్టు డిక్రీ ద్వారా మాకు 6.13 ఎకరాల భూమి సంక్రమించింది. మా ఫామ్‌హౌస్‌లో కూరగాయలు పండించుకునేటోళ్లం. అక్కడికి ఇప్పుడు పోతే బెదిరిస్తున్నరు. పోలీస్‌స్టేషన్‌కు పోతే ఏదో నామమాత్రంగా ఎఫ్ఐఆర్ చేసిండ్రు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు
– బాధితుడు కృష్ణ ఆవేదన