నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సం హరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 47 మంది తుదిపోరులో నిలిచారు. ఆయా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 130 మంది అభ్యర్థులు 199 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 15న జరిగిన స్క్రూట్నీలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 83 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండగా, చివరి రోజు సోమవారం 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరికి మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. వీరి కోసం మూడు ఈవీఎం యూనిట్లు ఉపయోగించాల్సి వస్తున్నదని ఎన్నికల అధికారులు తెలిపారు.