CPI | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నామినేటెడ్ పోస్టుల అంశం సీపీఐ నేతల్లో చిచ్చురేపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, రెండు కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా నామినేటెడ్ పోస్టులపై స్పష్టత ఇవ్వకపోవడంపై సీపీఐ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలో సీపీఐలో సామాజిక న్యాయం అనే నినాదం తెర మీదకు వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించనున్న నామినేటెడ్ పోస్టులను అగ్రవర్ణాలకే కట్టబెట్టకుండా తమకూ వాటా ఇవ్వాలన్న డిమాండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నది.
ఇప్పటికే ఎమ్మెల్యే పదవి కూనంనేని సాంబశివరావుకు దక్కిందని, ఎమ్మెల్సీ పదవితోపాటు రెండు కార్పొరేషన్ల పదవులను కూడా అగ్ర కులాలవారికే కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పార్టీకి వచ్చే మూడు పదవులను చాడ వెంకట్‌రెడ్డి, కే శ్రీనివాస్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి వంటివారికే ఇస్తే ఇతర సామాజికవర్గాల నేతలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి ఎమ్మెల్సీ, ఇద్దరికి కార్పొరేషన్ పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతున్నది. బాల నర్సింహ, బాల మల్లేశ్, ఎలికంటి సత్యం, ఈటె నర్సింహ వంటి వారికి ఒక్కసారైనా అవకాశం ఇస్తారా? లేదా? అన్న చర్చ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ పార్టీ సీపీఐకి రెండు కార్పొరేషన్ పదవులు ఇస్తే వాటిలో ఒకటి మీడియా అకాడమీ ఉంటుందని చెప్తున్నారు. ఈ పదవికి శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వ్యవహరించిన శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ ఇప్పుడు కూడా అదే పదవి ఎందుకు? ఇంకా ఏదైనా మంచి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నది. పార్టీ కోటాలోనే మీడియా అకాడమీ పదవిని భర్తీ చేస్తే ఒక్క కార్పొరేషన్ పదవి మాత్రమే దక్కుతుందని, దీనిని స్వతంత్ర పదవిగా పరిగణించాలని సీపీఐ నేతలు కోరుతున్నారు.
సీపీఐ నేతలు కూడా పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి వారే పైరవీలు చేసుకుంటున్నారు. కొంతమంది నేతలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌లో కీలకమైన నేతల వద్దకు వెళ్లి కలుస్తున్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా చాలామంది నేతలు అసెంబ్లీ లాబీల్లో కనిపించారు. మర్యాదపూర్వకంగా మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చామని చెప్తున్నా.. నామినేటెడ్ పదవులపైనే దృష్టి సారించినట్టు తెలుస్తున్నది.
సీపీఐలో ఇద్దరు సహాయ కార్యదర్శుల నియామకంపై పార్టీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. పార్టీలో రాష్ట్ర కార్యదర్శి తర్వాత.. రాష్ట్ర కార్యవర్గంలో కీలక పదవులైన అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మొదట అసెంబ్లీ ఎన్నికల తర్వాత భర్తీ చేస్తామన్నారు.. ఆ తర్వాత జాతీయ కౌన్సిల్ సమావేశాల తర్వాత చేస్తామన్నారు. అవన్నీ పూర్తయినా అసిస్టెంట్ సెక్రటరీలను మాత్రం భర్తీ చేయలేదు. ఈ ఇద్దరు సహాయ కార్యదర్శులలో ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ ఉండాలనే ప్రతిపాదన కూడా ఉన్నది. కనీసం అదైనా కార్యరూపం దాల్చలేదు. పార్టీలో బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకూ వినిపిస్తున్నది. కనీసం ఈ పదవులు వారికి కేటాయించినా కొంత న్యాయం చేసినవారవుతారనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తున్నది.