CM KCR | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): గత ఎన్నికల ఫలితాలే ఈసారీ రిపీటవుతాయని ఇప్పటికే స్పష్టమైంది. ఆ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌లో సమరశంఖం పూరించి గజ్వేల్‌లో ముగించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. ఈసారి కూడా సీఎం కేసీఆర్ అదే ఒరవడి అనుసరిస్తున్నారు. గతనెల 15న హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభతో ప్రజల్లోకి వెళ్లారు. ఈ నెల 9న తొలుత గజ్వేల్‌లో నామినేషన్ వేసి అనంతరం కామారెడ్డి చేరుకుంటారు. అక్కడ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రజాఆశీర్వాద సభలో పాల్గొంటారు. 28న గజ్వేల్ సభతో ప్రచారాన్ని ముగిస్తారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చాయి. ఈసారి అంతకుమించి ప్రజలు ఆశీర్వదించి చరిత్రను తిగరాసే వాతావరణం కనిపిస్తున్నది.
అదే జోరు.. అదే ఒరవడి
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల సందర్భంగా అనుసరించిన ప్రచార సరళినే ఈసారీ అనుసరిస్తున్నారు. 2018 ఎన్నికల్లో దాదాపు 100 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రజలకు చేరువై ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించినట్టే ఈసారి అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఈసారి 96 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రజలను కలుసుకోనున్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా సీఎం కేసీఆర్ ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా తన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఎదురుచూసే ప్రజలను ఎప్పుడూ నిరాశకు గురిచేయరని గతనెల 30వ తేదీతోపాటు సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు నిరూపించాయి.