రవీంద్రభారతి, ఆగస్టు 20 : బీసీ ప్రధాని అని చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ యూనిక్ కోడ్ లేకుండా కులగణన చేస్తామని చెప్పడం మరోసారి బీసీలను మోసం చేసేందుకేనని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. గురువారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి డీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యుడు పీ విల్సన్, ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త జే పూర్ణచందర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో బీసీ కులాలను శాస్త్రీయంగా నమోదు చేయాలంటే ప్రతి కులానికి కుల సంకేతం కేటాయించి రాష్ర్టాల వారీగా ప్రామాణిక కులాల జాబితా (యూనిక్ కోడ్) రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజ్యసభ సభ్యుడు విల్సన్ మాట్లాడుతూ.. బీసీ జనాభా సుమారు 52 శాతం ఉన్నట్టు మండల్ కమిషన్ అంచనా వేసిందని చెప్పారు. 1931 గణాంకాలే మండల్ కమిషన్ సిఫార్సులకు, కేంద్రంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రధాన ఆధారంగా నిలిచాయని చెప్పారు. కుల సంకేతం లేకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. పూర్ణచందర్రావు, చిరంజీవులు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా బీసీ కులాల జనాభా లెక్కలు అందుబాటులో లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమలుచేస్తున్న విధానాన్నే బీసీలకు ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.