ఆదిలాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ‘తాతల కాలం నుంచి ఎవుసాన్నే నమ్ముకొని బతుకుతున్నం. మాకున్న ఐదెకరాలతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నం. గతంలో గిప్పటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కోలే. భారీ వానలతో పంటలు నష్టపోయినం. చేతికొచ్చిన పంటను అమ్మడానికి మార్కెట్ యార్డులో రాత్రీపగలు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇయ్యక పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చింది. రూ.2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. యూరియా యాప్‌లో నమోదు చేసుకుంటే కూడా ఒక్కటే బస్తా ఇచ్చిన్రు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవుసం చేయాలంటే రైతులు జంకుతున్నరు’ అని ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడం ప్రవీణ్ ఆవేదన వ్యక్తంచేశాడు. సాగులో వచ్చిన నష్టాలు తట్టుకోలేక రైతు తుడుం గణపతి(60) ఈనెల 19న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయమై ఆయన కొడుకు తుడుం ప్రవీణ్ వ్యవసాయంలో ఎదురవుతున్న కష్టనష్టాలను శనివారం ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నాడు.
ఆ వివరాలు ఇలా..15 లక్షల వరకు అప్పులు..
‘మాకు ఐదెకరాల సొంత భూమి ఉన్నది. మరో 18 ఎకరాల భూమిని మా నాన్న కౌలుకు తీసుకున్నడు. రెండు పంటలు సాగు చేసుకునే వాళ్లం. మాకున్న సొంతభూమితోపాటు కౌలుకు తీసుకొన్న భూమిలో సోయా, పత్తి సాగు చేశాం. ఆదిలాబాద్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.3 లక్షల అప్పు ఉన్నది. దీంతోపాటు మరో రూ.12 లక్షల వరకు కౌలు, సాగుకు ఖర్చు అయ్యింది. వర్షాలతో పంటలు కాపాడుకుందామనే మందులకు ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చింది’ అని ఆవేదన చెందాడు.
రెండు పంటలు నష్టపోయాం..
వానకాలంలో మా సొంత భూమితోపాటు కౌలుకు తీసుకున్న భూమిలో సోయాబిన్, పత్తి పంటలు వేయగా వర్షాలతో నష్టపోయి పెట్టుబడులు కూడా రాక అప్పులపాలు కావాల్సి వచ్చింది. యాసంగిలో జొన్న వేయగా దిగుబడి సరిగా వచ్చే అవకాశాలు లేవు. దీంతో మా నాన్న గణపతి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గతంలో సాగునీటి కోసం బోరు వేయగా నీళ్లు పడలేదు. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే అటుండే. రెండు పంటలు నష్టపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నడు’ అని ప్రవీణ్ కన్నీరుమున్నీరయ్యాడు.
యూరియా బస్తాలు దొరకడం లేదు..
‘సాగు కోసం యూరియా అవసరం. రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వం సరఫరా చేయాలి. ఇప్పుడు యాప్ పెట్టి యూరియా ఇస్తామంటున్నరు. యాప్‌పై రైతులకు అవగాహన లేదు. యూరియా బస్తాలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మేము కూడా మందు బస్తాల కోసం బాగా తిప్పలు పడ్డం’ అని ప్రవీణ్ వెల్లడించాడు.
వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు..
సాగులో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో రైతుబంధు పథకంపై రైతులకు నమ్మకం ఉండేది. ప్రతి సీజన్‌కు పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా నేరుగా రైతుబంధు సాయం కర్షకుల ఖాతాల్లో పడేది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం ఎన్నికల సమయంలోనే వస్తున్నది. యాసంగి సాయం ఇప్పటివరకు రాలేదు. మా గ్రామంలో 80 శాతం మందికి రూ.2 లక్షల రుణమాఫీ కాలేదు. కష్టపడి సాగు చేసిన పంటను కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పేరిట మద్దతు ధరతో కొనుగోలు చేయకపోవడం ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయించి రైతులు నష్టపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా సమయంలో కూడా పంటలు కొన్నది. ఇప్పుడేమో పంటలు అమ్మకోవాలన్నా, మందుబస్తాలు కావాలన్నా యాప్‌లో వివరాలు నమోదు చేసుకొమంటున్నారు. రైతులకు అవసరమైన యూరియా దొరకడం లేదు. రైతుల వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు గణపతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
– ఆర్లీ (బీ) రైతులు
పంట అమ్మకానికి పడిగాపులు
‘మా నాన్న గణపతి కష్టపడి పండించిన సోయాను మద్దతు ధరకు విక్రయించడానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. నిరుడు నవంబర్ 18న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన ముందు రోజు మా నాన్న సోయాబీన్ విక్రయించడానికి మార్కెట్ యార్డులోనే ఉన్నాడు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో ఉంటున్నా కొనుగోలు కేంద్రం సిబ్బంది నాణ్యత సరిగా లేదని తిరస్కరించారు. పంటను అమ్మడానికి పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. పంట నాణ్యత లేదని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తిరస్కరిస్తున్నారని తెలిపాడు. 18 ఎకరాలను రూ.3.80 లక్షలతో కౌలుకు తీసుకున్నానని, కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని మా నాన్న అప్పుడు చెప్పిండు. ఇప్పుడు అనుకున్నంత పనిచేసిండు’ అని ప్రవీణ్ వెల్లడించాడు.