హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్‌లో కొత్తగా టీజీఐపాస్లో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి నిరాశే మిగులుతున్నది. అన్ని శాఖల నుంచి అనుమతులు వచ్చినా విద్యుత్తు కనెక్షన్ దగ్గరే దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు సుమారు 305 పరిశ్రమలు కరెంట్ కనెక్షన్ లేక ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దక్షిణ డిస్కమ్ తీరుతో
చిన్నతరహా పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి నెలకొన్నది. పరిశ్రమలకు విద్కుత్ కనెక్షన్లు ఇవ్వని కారణంగా దక్షిణ డిస్కమ్‌కు ప్రతినెలా ఒక్కో కంపెనీ నుంచి సరాసరి బిల్లుల రూపంలో రావాల్సిన రూ.40వేల నుంచి 70వేల వరకు ఆదాయం ఆగిపోయిందని, మొత్తంగా సుమారు రూ.6కోట్ల నుంచి రూ.12కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు టీజీఎస్పీడీసీఎల్కు చెందిన ఓ చీఫ్ ఇంజినీర్ చెప్పారు.
కనెక్షన్ కోసం డబ్బులు కట్టినా
టీజీఐపాస్లో దరఖాస్తు చేసుకున్న చిన్నతరహా పరిశ్రమలు తమ పరిశ్రమ కోసం కరెంట్ కనెక్షన్ కావాలంటే డీటీఆర్ కోసం డబ్బులు చెల్లించాలి. ఈ మేరకు యజమానులు డిస్కమ్ పేర్కొన్నట్టు ఎల్టీ కోసం 49 హెచ్‌పీ లోడ్‌తో 11కేవీ వోల్టేజ్‌తో టర్న్ కీ స్కీమ్ కింద 63కేవీ డీటీఆర్తో ఎల్టీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో సర్వీస్ చార్జీలతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ కింద వేల రూపాయల డీడీలు కట్టారు. నగర శివారు పటాన్చెరు, తదితర ప్రాంతాలకు చెందిన కొన్ని చిన్నతరహా పరిశ్రమలు జనవరిలో డిపాజిట్ కింద చెల్లించి కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా టీజీఐపాస్ అనుమతుల్లో భాగంగా డిస్కమ్‌కు సర్వీసు చార్జీలు చెల్లించిన తర్వాత వారు తమ వద్ద ఉన్న డీఈ(ఎంఆర్టీ)లను ట్రాన్స్ఫార్మర్ల టెస్టింగ్ కోసం పంపాలి. వారు టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డీటీఆర్‌ను బిగించి పరిశ్రమలకు అవసరమైన కరెంట్ సరఫరా చేస్తారు. ఈ డీటీఆర్‌ను కూడా డిస్కమ్‌లో నమోదైన ఆ ఆరు కంపెనీల వద్దే కొనుగోలు చేయడం, స్థానిక డివిజనల్ ఇంజినీర్ డీటీఆర్‌కు సంబంధించిన టెస్టింగ్ చేసిన తర్వాత కనెక్షన్ ఇవ్వడం అనేది ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి వస్తున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా టీఎస్ఐపాస్ తీసుకురావడం, తద్వారా అనుమతులు వెనువెంటనే రావడంతో పరిశ్రమలు నిరంతరాయంగా సాగేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుమతుల విషయంలోనే మల్లగుల్లాలు పడుతుంటే ఆరేడు నెలలుగా కనెక్షన్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో 300కు పైగా కొత్త కంపెనీలు ప్రారంభం కావడం లేదని దరఖాస్తుదారులు చెప్పారు.
కమీషన్ల కోసమే జాప్యం!
పరిశ్రమల స్థాపనతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగించాల్సిన ప్రభుత్వమే కొత్తవి రాకుండా కొర్రీలు పెడుతున్నది. ఎస్పీడీసీఎల్ ద్వారా కనెక్షన్ ఇవ్వాల్సిన దగ్గర ఏదైతే డీటీఆర్ కంపెనీల లిస్ట్ ఖరారు చేయాల్సిన విద్యుత్ శాఖ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం, ఆయా కంపెనీల నుంచి తమకు రావాల్సిన కమీషన్లపై ఒక డీల్ కుదరకపోవడమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీల నుంచి కనీసం 20నుంచి 25శాతం కమీషన్ వస్తేనే వాటికి అనుమతి ఇవ్వాలని, వారి నుంచి కొనుగోలు చేయాలని లేకపోతే అడపాదడప కొన్ని తెచ్చి డీటీఆర్ కొరతను సృష్టించాలని ఆ శాఖ అధిపతే చెప్పినట్టు డిస్కమ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమీషన్ విషయంలో కంపెనీలు అంత పెద్ద మొత్తంలో ఇచ్చుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే డీటీఆర్‌ల కొనుగోళ్లు నిలిచిపోయాయని మింట్ కాంపౌండ్‌లో చర్చ జరుగుతున్నది. మరోవైపు తమకు కావాల్సిన డీటీఆర్ తెచ్చుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా, కంపెనీలకు రెన్యువల్స్ చేయకుండా, కొత్త కంపెనీలతో జాబితాలు తయారుచేయకుండా నెలల తరబడి జాప్యం చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నదని చిన్నతరహాపరిశ్రమ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ నగరవాసి ఆందోళన వ్యక్తంచేశాడు.
పొంతన లేని అధికారుల సమాధానాలు!
పరిశ్రమలకు కరెంట్ కనెక్షన్ విషయంలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పారు. టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్న స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్‌కు ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదని దక్షిణ డిస్కమ్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణిని అడిగితే అసలు ఆ విషయమే తనకు తెలియదని, అవగాహన లేకుండా మాట్లాడలేనని బదులిచ్చారు. ఇదే విషయమై కమర్షియల్ సీఈని ఆరా తీస్తే ఇంకా డీటీఆర్ కంపెనీల వెండర్ లిస్ట్ ఖరారు కాలేదని, అందుకే తామేం చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. పైగా పీఅండ్ఎంఎం వారిని అడుగాలని సలహా ఇచ్చారు. కంపెనీల లిస్ట్ ఫైనల్ కాలేదంటూనే ఈ వ్యవహారమంతా మరో అధికారి చూస్తున్నారంటూ వారు దాటవేశారు. ఇలా ఎవరికి వారు తమకు తెలియదంటూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవలసిన టీజీఐపాస్ దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రియల్ కారిడార్‌లో నిర్మిస్తున్న పరిశ్రమల పరిస్థితి కూడా ఇలాగే ఉందని వారికి కూడా కనెక్షన్లు ఇవ్వకపోగా పరిశ్రమలు ప్రారంభం కాకపోవడంతో టీజీఐఐసీ వారు పరిశ్రమలు ప్రారంభించకపోతే స్థలాన్ని వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నారని ఒక దరఖాస్తుదారుడు చెప్పారు.
ఏ ప్రభుత్వమైనా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ముందుంటూ చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి. కానీ సమైక్యపాలనలో అప్పటి ప్రభుత్వాలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేయడం వల్ల పలు కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోయాయి. ఈ క్రమంలోనే కరెంట్ సరఫరా, కనెక్షన్లకు సంబంధించి ఆనాటి పారిశ్రామికవేత్తలు రోడ్డెక్కి ఇందిరాపార్క్ వద్ద గంటల తరబడి ధర్నాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో కరెంట్ కోసం ధర్నాలు లేవు. పరిశ్రమలు పవర్ హాలిడేలు లేవు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలు క్షణం తీరిక లేకుండా నడిచాయి. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సింగిల్‌విండో విధానం ద్వారా అన్ని అనుమతులు సులభంగా వచ్చేవి.
డీటీఆర్ ఎక్కడ కొనాలి!
కొన్నేండ్లుగా విద్యుత్ కనెక్షన్ల కోసం ఆరు కంపెనీలకు డీటీఆర్ ఇచ్చేందుకు అనుమతులు ఉన్నాయి. వీటిని ఏటా ఈ కంపెనీలకు రెన్యువల్ చేస్తున్న డిస్కమ్ అధికారులు ఐదు నెలలుగా కంపెనీలకు అనుమతి ఇవ్వకపోగా కొత్తవాటికీ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఏ కంపెనీల వద్ద తాము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు(డీటీఆర్) కొనుగోలు చేయాలో తెలియక దరఖాస్తుదారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే సమయంలో కంపెనీల ప్రతినిధులు మింట్ కాంపౌండ్‌లోని కార్పొరేట్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రెన్యువల్స్ ఇవ్వడం లేదు. ఫలితంగా డీటీఆర్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో తాము డీటీఆర్లు ఎక్కడ కొనుగోలు చేయాలని పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు అడుగుతున్నా.. ఐదునెలలుగా డిస్కమ్ ఉన్నతాధికారులు త్వరలో ఆర్డర్లు ఇస్తామంటూ సాగదీస్తూ వచ్చారు. ఇదే సమయంలో డీటీఆర్ కంపెనీల జాబితా ఖరారు చేయకపోవడంతో కొనుగోలుపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. గతంలో ఉన్న సీఎండీ ఈ వ్యవహారంలో కొర్రీలు పెట్టిపోతే ప్రస్తుతం సీఎండీ ఈ విషయం తనకెందుకులే అని వదిలేశారని అందుకే కనెక్షన్ రాకుండా పోతున్నదని ఆ దరఖాస్తుదారుడు ఆవేదనతో చెప్పాడు.