హైదరాబాద్ : డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జీనోమ్ సీక్వెన్స్‌కు నమూనాలు పంపించిన సంగతి తెలిసిందే. అయితే జీనోమ్ నివేదికలో ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సోమవారం వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన మహిళ(35) స్వస్థలం రంగారెడ్డి జిల్లా.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో రాష్ట్ర వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. మాస్కు ధరించని యెడల రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే కరోనా మన దరి చేరదు అని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
ఇదిలా ఉండగా విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. వారి జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టు రావాల్సి ఉంది. వీరంతా యూకే, కెనడా, అమెరికా, సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. యూకే నుంచి వచ్చిన 9 మందికి… అమెరికా, కెనడా, సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ సోకినట్లుగా పరీక్షల్లో వెల్లడైంది.