హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, అందులో భాగమే కోకాపేటలో ఎకరం వంద కోట్లు దాటేసిందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని క్రెడాయ్ తెలంగాణ కార్యాలయంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త మాస్టర్ప్లాన్లను రూపొందించాలని సూచించారు. కొంత భూమి మాత్రమే అనుమతులకు అనుకూలంగా ఉండటం, ఎక్కువ భూమి వివిధ జోన్లలో ఉండటంతో ఉన్న భూమికి డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు. 111 జీవో పరిధిలో ప్రత్యేక మాస్టర్‌ప్లాన్, అందులో డిస్నీ ల్యాండ్, యూనివర్సల్ స్టూడియో వంటి పర్యావరణ అనుకూలమైన వినోద పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రం స్టీల్, సిమెంట్ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ కొత్త కార్యవర్గాన్ని, యూ త్ వింగ్ కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా డీ మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షుడిగా డీ ప్రేంసాగర్‌రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా కే ఇంద్రసేనారెడ్డి, సెక్రటరీగా జీ అజయ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా పాండు రంగారెడ్డి, పురుషోత్తంరెడ్డి, గుర్రం నర్సింహారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కోశాధికారిగా జగన్మోహన్, జాయింట్ సెక్రటరీలుగా వెంకటేశ్వర్ రావు, బండారి ప్రసాద్, చేతి రామారావు, యూత్ వింగ్ కో-ఆర్డినేటర్‌గా సంకీర్త్ ఆదిత్యరెడ్డి, కార్యదర్శిగా రోహిత్ అశ్రిత్ ఎన్నికయ్యారు.