ఖైరతాబాద్, ఏప్రిల్ 2: చికెన్ షాపు యజమానులకు విక్రయాల్లో లాభాలు వస్తున్నాయని, కొందరు రిటైలర్లు కావాలనే రేట్లు పెంచాలని, లాభాలు రావడం లేదంటూ ఆందోళనలు చేయడం అర్థరహితమని బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్టినేషన్ కమిటీ స్పష్టంచేసింది. ఎర్రమంజిల్లోని హోటల్ మెర్క్యూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్నేహా చికెన్ మేనేజింగ్ డైరెక్టర్ రాంరెడ్డి, వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ బాల సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ.. చికెన్ ధరల వ్యవహారంలో రిటైల్ దుకాణాదారులే అధిక లాభాలు పొందుతుండగా, రైతులు, ఇంటిగ్రేషన్ సంస్థలే నష్టపోతున్నాయని వాపోయారు.
రిటైల్ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుండా నడిచే వ్యవస్థగా మారిందని పేర్కొన్నారు. ప్రతి రోజూ ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రిటైలర్లకు మాత్రం ప్రతి కిలోపై స్థిరమైన లాభం వస్తున్నదని తెలిపారు. పౌల్ట్రీ రంగంలో రైతులు, ఇంటిగ్రేషన్ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టి రిస్క్ భరిస్తున్నప్పటికీ మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు నష్టాలు కూడా వారికే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. హోల్సేల్ వ్యాపారులు కొంత వరకు రిస్క్ ఎదుర్కొంటున్నప్పటికీ, రిటైల్ దుకాణదారులకు మాత్రం ఎటువంటి నష్టం ఉండదని వెల్లడించారు. ఇంటిగ్రేషన్ కంపెనీలు, రిటైర్ల మధ్య ప్రత్యక్ష సంబంధం లేకపోవడం వల్ల ధరల నిర్ణయంలో స్పష్టత లేకుండా పోతుందని, ఇలాంటి తరుణంలో వినియోగదారులపై అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నారు.
రెండు మూడు రోజుల నుంచి చికెన్ షాపు యజమానులు మార్జిన్ తక్కువైందని ధర్నాలు, నిరసన తెలుపుతున్నారని, తాము స్వయంగా ఎక్కడా పెంచలేదని వెల్లడించారు. ప్రస్తుతం ఫామ్ రేటు రూ.130 ఉండగా, ప్రాసెసింగ్ తర్వాత రూ.214కు చేరుతుందని, కానీ మార్కెట్లో రూ.259 ఉండడం వల్ల కిలోకు రూ. 45 మిగులుతున్నదని, రూ. 40 లాభం వచ్చేలా చేయాలనడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిరసనలు మానుకొని, వినియోగదారులపై భారం మోపడం మానుకోవాలని రిటైలర్లకు సూచించారు. సమావేశంలో కే సురేందర్ రెడ్డి, ఏ తిరుపతి రెడ్డి, బీ శ్రీనివాస్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.