వ్యక్తి పరివర్తన గీతా దర్శనం
ఒక భౌతిక శరీరాన్ని వదిలి మరొక భౌతిక దేహాన్ని ధరించే జీవాత్మ గమనం స్థూల, సూక్ష్మ కారణ శరీరాల ద్వారా కొనసాగుతుంది. మరణ సమయంలో స్థూల శరీరం మాత్రమే నశిస్తుంది. సూక్ష్మ, కారణ శరీరాలతో జీవాత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. శిశిర రుతువులో ఆకులు రాలిపోయిన సమయంలో చెట్లు కొత్త ఆకులు చిగురిస్తాయని సంతోషపడతాయే కాని దుఃఖపడవు.
వాసాంసి జీర్ణాని యథా
విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని
సంయాతి నవాని దేహీ॥
(భగవద్గీత 2-22)
మనుషులు చిరిగిపోయిన వస్ర్తాలను వదిలి కొత్త దుస్తులను ఎలా ధరిస్తారో, అలాగే జరావ్యాధి పీడితమై జీర్ణమైన శరీరాన్ని వదిలి ఆత్మ కూడా మరొక కొత్త దేహాన్ని ఆశ్రయిస్తుంది. ‘జీర్ణాన్ని’ అనడం వల్ల వార్ధక్యం వచ్చాకనే మనిషి మరణిస్తాడు అనుకోవడం కన్నా ఆయువు తీరడంగా చెప్పుకోవడం సమంజసం.
ఒక భౌతిక శరీరాన్ని వదిలి మరొక భౌతిక దేహాన్ని ధరించే జీవాత్మ గమనం స్థూల, సూక్ష్మ కారణ శరీరాల ద్వారా కొనసాగుతుంది. మరణ సమయంలో స్థూల శరీరం మాత్రమే నశిస్తుంది. సూక్ష్మ, కారణ శరీరాలతో జీవాత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. శిశిర రుతువులో ఆకులు రాలిపోయిన సమయంలో చెట్లు కొత్త ఆకులు చిగురిస్తాయని సంతోషపడతాయే కాని దుఃఖపడవు. శిథిల దేహ పరిత్యాగమే మరణం. ఆత్మ సనాతనమైనది, అమరమైనదని, శరీరం నశించేదని అర్జునుడికి వివరిస్తున్నాడు జగద్గురువు. ఇక్కడ గుర్తించాల్సింది… ఆత్మే శరీరాన్ని స్వీకరిస్తుంది కాని శరీరం ఆత్మను గ్రహించదు. ఆత్మ చైతన్య స్వరూపం. చైతన్యం అని పిలిచే జీవాత్మ శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు ‘నేను’ అనే భావన కలుగుతుంది.
తాత్వికంగా ఆత్మ గమనాగమనాలు లేని నిశ్చలమైనది. అయితే ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని ఎలా స్వీకరిస్తుంది? ఒక దుకాణం నుంచి కుండను మన ఇంటికి తీసుకువస్తాం. నిజానికి దానికి గమనాగమనాలు లేవు. అలాగే సూక్ష్మ శరీరానికి గల గమనాగమనాలు, ఆత్మతో ఉన్న సంబంధాలను అనుసరించి ఒక శరీరాన్నుంచి ఆత్మ మరొక దేహానికి ప్రయాణిస్తున్నది.
సహజమైన జనన మరణాల మధ్య ఈ లోకాన్ని ఎలా దర్శిస్తున్నాడన్నదే వ్యక్తి జీవన ప్రయోజనాన్ని గుర్తించేందుకు కొలమానంగా నిలుస్తుంది. రాగద్వేషాలకు లోబడిన అర్జునుడు స్వధర్మ నిర్వహణకు విముఖుడైన సంసార జీవికి ప్రతీక. స్వధర్మాచరణ లేని వ్యక్తి ధర్మభ్రష్టుడు అనబడుతాడు. ధర్మనిష్ఠ జీవన ప్రయోజనానికి దర్పణం కాగా స్వధర్మ విముఖత ఇష్టాయిష్టాలకు పరిమితమైనది. ఇష్టాయిష్టాలకు ప్రాతిపదిక ‘నేను నాది’ లేదా స్వపర భేదాలనే రాగద్వేషలే.
భగవద్గీతలో చెప్పిన ‘పాత వస్ర్తాలను విడిచి కొత్త వస్ర్తాలను ధరించడం’ అనే ఉపమానం ఆధునిక యాజమాన్య నిర్వహణ శాస్త్రంలో ‘పరివర్తనా నిర్వహణకు’ ప్రతీకగా చెప్పుకోవచ్చు. సంస్థలో వ్యక్తి పాత్ర ముఖ్యమైనది. ఉద్యోగులు, నాయకులు రావచ్చు, వెళ్లవచ్చు. కానీ సంస్థ లక్ష్యం, విలువలు, సంస్కృతి కొనసాగాలి. దీనిని మరొక విధంగా అర్థం చేసుకుంటే వ్యక్తులు శరీరాలైతే, సంస్థ ఆత్మ వంటిది.
ఎలాగైతే పాత వస్ర్తాలను విడిచి కొత్త వస్ర్తాలను ధరించడం సహజమో అలాగే మార్పును ఆహ్వానించాలే కాని భయపడకూడదు. సంస్థలో పాత విధానాలు, పాత సాంకేతికత, పాత వ్యాపార నమూనాలు కాలానుగుణంగా మారాలి. ముఖ్యంగా గుర్తించాల్సింది.. మార్పును ఆహ్వానించలేని సంస్థలు మూతబడతాయి లేదా వెనుకబడతాయి. అందుకే ఎదగాలనే కోరిక గలవారికి మార్పనేది అవరోధంకాదు అదొక అవకాశం అంటారు.
నాయకత్వం అనాసక్త నిర్ణయాలు తీసుకోకూడదు. నాయకుడైన అర్జునుడు బంధుప్రీతి, వ్యామోహాదుల ప్రభావంతో యుద్ధం చేయననే నిర్ణయం తీసుకున్నాడు. ఆధునిక నిర్వాహకులు కూడా వ్యక్తిగత అభిమానం, ఇష్టాయిష్టాలు, భావోద్వేగాలు, పక్షపాత వైఖరి ప్రాతిపదికగా కాకుండా సంస్థ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. స్వధర్మం అంటే ఎలాంటి ప్రలోభాలకూ, ఇష్టాయిష్టాలకు లోనుకాకుండా వృత్తి బాధ్యతలకు అనుగుణంగా కర్తవ్యాన్ని నిర్వహించడం. సంస్థ నిర్వహణలో ప్రతి ఉద్యోగికీ బాధ్యత ఉంటుంది. సంస్థ విజయం వ్యక్తి ప్రతిభపై కాకుండా, బృందం సామర్థ్యం, నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. అవసరమైన వేళ సంస్థలు కూడా ‘శరీరాలు’ మార్చుకోవాలి, కొత్త వ్యాపార నమూనాలను స్వీకరించాలి.
పాత దేహాన్ని విడిచి కొత్త దేహాన్ని స్వీకరించడం అనే భావన నిరంతర అభ్యాసాన్ని తెలుపుతుంది. అవరోధాలను అడ్డుకునే మార్పు, నిన్నటి గెలుపును రేపటి విజయానికి అడ్డంకిగా మార్చకూడదు. విలువల ఆధారితంగా, నాయకులు బాధ్యతలను ధర్మంగా నిర్వహించాలి. పాత పద్ధతుల ద్వారా కొత్త అవకాశాలను దర్శించి ఆహ్వానిస్తేనే సంస్థ నిరంతరయానం సజావుగా సాగుతుంది. భగవద్గీత ఈ శ్లోకం ద్వారా పునర్జన్మ సిద్ధాంతాన్ని మాత్రమే కాకుండా నాయకత్వంలో మార్పు నిర్వహణను ప్రస్తావిస్తూ యాజమాన్య నిర్వాహకులకు మార్గదర్శనం చేస్తున్నట్లుగా భావించవచ్చు.
…? పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

