ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం పైకప్పు నుంచి ఒక చుక్క నీరు కూడా లీకేజీ కావడం లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. రామప్ప ఆలయం గర్భాలయ ముఖ మండపంలోని 4 స్తంభాల నుంచి నీళ్లు కారుతున్నట్లు వచ్చిన వార్తలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించిన విషయం విదితమే. దీంతో రామప్ప ఆలయాన్ని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఆర్కియాలజీ అధికారి స్మితా ఎస్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం రామప్ప ఆలయాన్ని ఇవాళ పరిశీలించారు. నిచ్చెన సహాయంతో ఆలయంపైకి ఎక్కిన అధికారులు.. కప్పును పూర్తిస్థాయిలో, క్షుణ్ణంగా పరిశీలించారు. పైకప్పు నుంచి ఆలయం లోపలికి నీరు కారడం లేదని స్పష్టం చేశారు. ఆలయం మూడు వైపులా తెరిచి ఉండటంతో.. ఈదురు గాలులకు వర్షపు చినుకులు ఆలయంలో పడుతున్నాయని, అలా లోపలికి నీరు చేరుతోందని తెలిపారు.
రామప్ప ఆలయంలో నీళ్లు కారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్మితా కుమార్ స్పష్టం చేశారు. ప్రామాణికమైన సమాచారం వచ్చిన తర్వాతే వార్తలను ప్రచురించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆలయాన్ని పరిశీలించిన బృందంలో స్మితా కుమార్తో పాటు ఏఎస్ఐ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రకాంత్, అసిస్టెంట్ ఇంజినీర్ చైతన్య, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, జూనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ మాదిపల్లి మల్లేశం ఉన్నారు.