హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అమెరికా ప్రభుత్వం తమ దేశానికి వచ్చేవారికి మరో శుభవార్త చెప్పింది. అమెరికా వీసా పొందినవారు దానిని అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకున్నా లేదా మరో తరహా వీసాకు మారాలన్న రెండోసారి ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో ఏదైనా ఒక వీసాపై వెళ్లేవారు మళ్లీ అమెరికాకు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకు హాజరుకావడం తప్పనిసరి. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తివేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ అధికారులు ధ్రువీకరించారు. తమ వీసా దరఖాస్తులను డ్రాప్ బాక్స్‌లో వేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఎల్, ఆర్ వీసాలున్నవారు ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.