దుబ్బాక, మే 10 : దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్‌కు చెందిన రైతు గంగాల పరశురాములు (40) తనకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాగుకు చేసిన అప్పులు పెరిగిపోవడంతోపాటు సరైన దిగుబడులు రాకపోవడంతో మానసికంగా కలత చెందాడు.
జీవితంపై విరక్తి చెందిన ఆయన శుక్రవారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా, చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో భోరున విలపించారు. పరశురాములు భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు భూంపల్లి పోలీసులు తెలిపారు.