హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ పోలీస్ శాఖలో లింగవివక్ష పెరిగిపోయింది. ఇక నుంచి ‘ఉమెన్ పోలీస్, లేడీ పోలీస్’ అంటూ సంబోధించొద్దు. పోలీస్ ఆఫీసర్ అనే పిలవాలి. కేంద్ర, రాష్ట్ర పతకాలకు మహిళా పోలీసుల సేవలనూ సిఫారసు చేయాలి’ అని డీజీ స్థాయి మహిళా పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం ముగిసిన ఉమెన్ పోలీస్ మొదటి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను శనివారం ప్రభుత్వానికి పంపినట్టు పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష బిస్త్ వెల్లడించారు.
పోలీస్స్టేషన్లలో మహిళా పోలీసులకు రక్షణ కరువైందని, వేధింపులు, లైంగిక వేధింపులకు గురైతే పోష్ యాక్ట్‌ను అమలు చేయాలని, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)లు పకడ్బందీగా పనిచేయాలని, గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లోనూ మహిళా పెట్రోలింగ్ ఉండాలని తీర్మానించారు. నాన్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా మహిళలను ఎస్హెచ్వోలుగా నియమించాలని కోరారు.
స్టేషన్లో రిసెప్షనిస్టు విధులే కాకుండా, అన్ని ఫంక్షనల్ వర్టికల్ విభాగాల విధులు వేయాలని కోరారు. అన్ని పోలీస్ విభాగాల్లో జెండర్ సెన్సివిటీపై శిక్షణ ఇప్పించాలని, మహిళలకు కూడా ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను అప్పగించాలని కోరారు. వేధింపులను అడ్డుకునేందుకు ‘స్పెషల్ ఆల్-విమెన్ స్విఫ్ట్ యాక్షన్ టీమ్ (ఎస్డబ్ల్యూఏటీ)ని ఏర్పాటు చేయాలని కోరారు. బందోబస్తు డ్యూటీలు చేసేవారికి శానిటరీ, టాయిలెట్ వసతులు కల్పించాలని కోరారు. గణేశ్ బందోబస్తుకు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నెలలో ఒక లీవు ఇవ్వాలని, ఆరోగ్యం, వసతులు కల్పించాలని ప్రతిపాదించారు.