Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అదానీ అక్రమ సామ్రాజ్య పుట్టను తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గ్రూప్ అవకతవక వ్యాపార లావాదేవీల్లో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ పాత్ర ఊహించిన దానికంటే మరింత లోతుగా ఉన్నట్టు తెలుస్తున్నది. వినోద్‌తోపాటు ఆయన భార్య రంజన్బెన్కూ ఈ వ్యవహారంతో సంబంధమున్నట్టు ప్రఖ్యాత పత్రిక ‘బ్లూమ్‌బర్గ్’ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అదానీ గ్రూప్‌నకు నిధులను సేకరించడంలో వినోద్ కీలక భూమిక పోషించినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వినోద్ తన విషయాలను ఎక్కువగా బయటకు రానీయకుండా జాగ్రత్తపడతారని వెల్లడించింది. అదానీ గ్రూప్ అంటే వినోద్, గౌతవ్‌ు, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మరో సోదరుడు రాజేశ్, అలాగే ఫ్యామిలీ ట్రస్టు వంటి ఇతర సంస్థలు అని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అదానీ కంపెనీలు రుణాలను సేకరించడంలో వినోద్ పాత్రే కీలకమని, గ్రూప్‌నకు సంబంధించి అన్ని విదేశీ లావాదేవీలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించేవారని పేర్కొన్నది.
‘బ్లూమ్‌బర్గ్’ కథనం ప్రకారం.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, దుబాయ్‌లో ఏడు అన్‌లిస్టెడ్ కంపెనీలు నమోదయ్యాయి. వాటితో అదానీ గ్రూప్‌నకు సంబంధాలున్నాయి. నిరుడు అంబుజా, ఏసీసీ సిమెంట్ కొనుగోలు సమయంలో అదానీ గ్రూపే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ ఏడు సంస్థల అంతిమ లబ్ధిదారునిగా గౌతమ్ అదానీ బదులు వినోద్, రంజన్‌బెన్ ఉన్నారు. అంటే వినోద్‌కు తమ కంపెనీ ఆర్థిక లావాదేవీతో సంబంధం లేదంటూ అదానీ గ్రూప్ వెల్లడించిన ప్రకటన అబద్ధం. వినోద్ గత కొన్నేండ్లుగా దుబాయ్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నారైగా ఉన్న ఈయన సైప్రస్ జాతీయుడని పేర్కొంటూ కొన్ని ఫైలింగ్స్‌లో కనిపించింది. మారిషస్, సైప్రస్, యూఏఈ, సింగపూర్, కరేబియన్ దీవులలో వినోద్‌కు కొన్ని డొల్ల కంపెనీలున్నాయని సమాచారం. ఈ కంపెనీలతో వినోద్.. అదానీ గ్రూప్ కంపెనీలతో రహస్య లావాదేవీలు జరిపినట్టు హిండెన్‌బర్గ్ పేర్కొన్నది. దాదాపుగా ఇవే అనుమానాలను బ్లూమ్‌బర్గ్ వ్యక్తం చేస్తున్నది.