హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు తరలివచ్చే వాహనాలపై శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు పర్యావరణ రుసుం (ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫీజు) వసూలును నిలిపివేస్తున్నట్టు అటవీ-పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారని, దీని అమలుకు అటవీశాఖ ములుగు జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్జప్తి మేరకు జాతర ముగిసే దాకా ఈ ఫీజు వసూలును నిలిపివేస్తున్నామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.