వరంగల్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘బీజేపీ పాలనలో దేశంలో ఏ వర్గానికి మేలు జరగలేదు. మతం, కులం, ఆలయాల పేరుతో రాజకీయాలు చేస్తున్నది. పేదలు, దళితుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. దేశం కోసమే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాల్సి వస్తున్నది’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ, ములుగు జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి కడియం శ్రీహరి శుక్రవారం సమ్మక్క బరాజ్‌ను సందర్శించారు. బరాజ్‌పై సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కడియం మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్ని విషయాల్లోనూ అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. నదుల అనుసంధానం పేరుతో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నదని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తున్న కేంద్రంలోని బీజేపీపై తిరుగుబాటు చేయడం, దేశ రాజకీయాల్లో కొత్త మార్పులు తేవడంలో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సమ్మక్క బరాజ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని అని కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందని, పంజాబ్ తర్వాత తెలంగాణలోనే వరి సాగు ఎక్కువగా ఉన్నదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నదీజలాలపై తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. గోదావరి నదిపై ఉమ్మడి ప్రాజెక్టులు లేకున్నా దీనికి బోర్డును ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు అయినా కృష్ణా బోర్డు పరిధిలోకి తేలేదని, తెలంగాణకు మాత్రమే పరిమితమైన ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కేసీఆరే అసలైన రైతుబంధు అని కడియం శ్రీహరి కొనియాడారు. దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించేందుకు నిర్మించిన సమక్క బరాజ్‌ను పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సీఎం కేటాయించారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా 100 టీఎంసీలను కేటాయించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కడియం కృతజ్ఞతలు తెలిపారు.
గోదావరి మన రాష్ట్రంలో 417 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో గోదావరి పొడవునా ప్రాజెక్టులు కట్టారు. ఎస్సారెస్పీ పునర్జీవం కార్యక్రమంతో ప్రాజెక్టును బలోపేతం చేశారు. సదర్మాట్ దగ్గర బరాజ్, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క బరాజ్, సీతారామసాగర్ ప్రాజెక్టులతో గోదావరి ఇప్పుడు జీవనదిగా మారింది. దీనికి కారణమైన కేసీఆర్‌కు సెల్యూట్ చేస్తున్నా.
– కడియం శ్రీహరి