హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): శాసనసభ, శాసనమండలి లాబీల్లోకి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ప్రవేశ అనుమతిని నిరాకరిస్తున్నారు. కనీసం అసెంబ్లీ కారిడార్లలోకి కూడా వారిని రానివ్వకుండా ఏకంగా ఓ సర్క్యులర్ ను జారీ చేశారు. వివాదాస్పద ఈ నిర్ణయంపై వారంతా అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
వాస్తవంగా దేశంలోని అత్యున్నతమైన పార్లమెంట్లో మాజీ సభ్యులెవరినైనా లాబీల్లోకి అనుమతిస్తుంటారు. రాష్ర్టాల ఎమ్మెల్యేలు వచ్చి నా పార్లమెంట్ లాబీల్లోకి అనుమతిస్తారు. కానీ, తెలంగాణ శాసనసభ కొత్త పోకడలకు నిలయంగా మారుతున్నది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ ఎంపీలకు ప్రవేశ అనుమతినే నిరాకరిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 13న గవర్నర్ ప్రసంగానికి ముందు, ఓ సర్క్యులర్‌ను జారీచేశారు.