హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపక్షాలు అడిగితే రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్టులతో కొట్టాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, రక్తపాతాన్ని కోరుకుంటున్న రేవంత్‌కు, ఆరు హత్యలు చేసిన షాబాద్ దైవాలగూడ హంతకుడికి తేడా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన ‘ఎక్స్’ వేదికంగా ఘాటు గా స్పందించారు. ఈ మాటలు రేవంత్ శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రతిపక్షాలపై రేవంత్.. మీడియా సమావేశంలో మా ట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరమని, ఇంతటి నీచమైన, హింసాత్మకమైన వ్యా ఖ్యలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసినందుకు రాష్ట్ర ప్రజలు, రైతులకు రేవంత్‌రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చేతగానితనం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ డ్రామాలు ఆడటం సీఎంకు పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. పోక్సో నిందితుడికి కనీసం పదేండ్ల జైలుశిక్ష పడేలా కఠినమైన సెక్షన్లు నమోదుచేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ మానవ మృగం.. ఓ మైనర్‌పై ఘాతుకానికి ఒడిగట్టి ఆమె తల్లి, నాయనమ్మతోపాటు తన భార్య, ఇద్దరు పసిపిల్లలను అత్యంత కిరాతకంగా చంపి నరమేధం సృష్టించాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆ హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటికీ పట్టుకోలేకపోవడం హోంశాఖ చేతగానితనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం, ప్రజల తీవ్ర ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికే రేవంత్ సరార్ మళ్లీ అదే కాళేశ్వరం, మేడిగడ్డ, ఎన్డీఎస్ఏ పాట పాడుతున్నట్టు తెలిపారు. ‘కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయవచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయవచ్చు.. కానీ, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు’ అన్న అబ్రహాంలింకన్ మాటలు రేవంత్‌రెడ్డికి సరిగ్గా సరిపోతాయని పోల్చారు. ‘ఇసుక నుంచి నూనె తీయవచ్చు, ఎండమావిలో నీరు తాగవచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు.. కానీ మూర్ఖుల మనసు మార్చలేము’ అన్నట్టు రేవంత్‌రెడ్డి తీరు ఉన్నదని చురకలు అంటించారు.
కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి గోదావరి జలాలను ఎత్తిపోసి పంటలను కాపాడాలని రిటైర్డ్ ఇంజినీర్లు, బీఆర్ఎస్ తపన పడుతుంటే.. సీఎం రేవంత్ మాత్రం తనకు క్షుద్ర రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే కనీస ఆలోచన, తపన రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం లేదని దుయ్యబట్టారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం ఆడుతున్న డైవర్షన్ డ్రామాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హరీశ్‌రావు
హెచ్చరించారు.