e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home తెలంగాణ ఆ ఊర్లకు కరోనా రాలె

ఆ ఊర్లకు కరోనా రాలె

ఆ ఊర్లకు కరోనా రాలె
  • పక్కాగా నిబంధనల అమలు
  • గ్రామంలోకి కొత్త వ్యక్తులకు నో ఎంట్రీ
  • శుభకార్యాలు వాయిదా.. ప్రయాణాలు రద్దు
  • జీరో కేసులతో ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలు

కరోనా మహమ్మారి విజృంభణకు పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా వణికిపోతున్నాయి. కరోనా రక్కసికి జనం పిట్టల్లా రాలిపోతుంటే.. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్‌ కేసు నమోదుకాకుండా ప్రశాంతంగా ఉంటున్నాయి. కరోనా కట్టడికి నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటం, శుభకార్యాలు, ప్రయాణాలను రద్దు చేసుకోవడం వంటి కారణాలు ఆయా ఊర్లపై ప్రభావం కనిపించట్లేదు. ప్రభుత్వ సూచనలు, లాక్‌డౌన్‌ నిబంధనలను పక్కాగా పాటిస్తుండటంతో కరోనా పల్లెలను కన్నెత్తి చూడలేదు.

మెదక్‌, మే 16: కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో దాని కట్టడికి పలు గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. కరోనా ఉద్ధృతి ప్రారంభమైన సమయంలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు గ్రామసభలు నిర్వహించుకొని ప్రత్యేక తీర్మానాలు చేసుకొన్నారు. ప్రజలు గుమిగూడొద్దని, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, కచ్చితంగా శానిటైజ్‌ చేసుకొనేలా నిబంధనలు పెట్టుకుని కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఒకవేళ పెళ్లిళ్లు జరుపుకోవాలంటే తక్కువ మంది దగ్గరి బంధువుల సమక్షంలో నిర్వహించుకోవడంతోపాటు అత్యవసరమైతేనే ఇతర గ్రామాలకు వెళ్తున్నారు. ఇలా పక్కాగా కొవిడ్‌ నివారణకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తుండటంతో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావట్లేదు.
ఆదర్శం.. తండాలు
కరోనా మొదటి వేవ్‌లో స్వీయ నిబంధనలు రూపొందించుకొని పక్కాగా అమలు చేసిన మెద క్‌ జిల్లాలోని 27 తండాలు ఫలితం సాధిం చా యి. మొదటి, రెండో వేవ్‌లోనూ ఒక్క కొవిడ్‌ కేసు లేకుండా రా ష్ర్టానికే ఆదర్శంగా నిలిచాయి. అల్లాదుర్గం పీహెచ్‌సీ పరిధిలోని సీతానగర్‌తండా, కోమటితండా, చోటక్‌తండా, టేక్మాల్‌ పీహెచ్‌సీలో హసన్‌మహ్మద్‌పల్లి, కౌడిపల్లి పీహెచ్‌సీలో వసురాంతండా, పీర్ల తండా, గొగ్లకుతండా, గంగెద్దులగూడెం, ఫైజాబాద్‌తండా, ఇర్రమట్టితండా, గంగారాంతండా, రేగోడ్‌ పీహెచ్‌సీలో రాయలంకాతండా, గజవాడతండా, రెడ్డిపల్లి పీహెచ్‌సీలో లాలుతండా, గన్యాతండా, సంగ్యతండా, లాచ్‌లాంతండా, జెమ్యాతండా, పెద్దచింతకుంట స బ్‌ సెంటర్‌లో వాల్యాతండా, అర్జుతండా, సీతారాంతండా, రెడ్డిపల్లి సబ్‌సెంటర్‌లో లక్ష్మణ్‌తండా, రైస్‌మిల్‌ తండా, ఖాజీపేట్‌తండా, పిల్లికుంటతండా, చిప్పల్‌తుర్తి సబ్‌సెంటర్‌లో అలుగుతండా, బలియాతండా, శివ్వంపేట పీహెచ్‌సీలో లింగోజిగూడ తండాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు.

జీవనశైలే రక్షణచట్రం

మహబూబ్‌నగర్‌, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామీణప్రాంత ప్రజల జీవనశైలి కరోనా నుంచి వారికి రక్షణ కల్పిస్తున్నది. పొద్దున లేచిన్పటి నుంచి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుండటం.. రాత్రివేళ ఇంటికి చేరుకోవడం, సేంద్రీయ ఎరువులతో సాగుచేసిన బియ్యం, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం, కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలుచేయడం వంటి కారణాలతో తమ గ్రామాలకు కరోనా మహమ్మారిని రాకుండా అడ్డుకొంటున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని కోల్‌బాయితండా, శిఖర్‌గాన్‌పల్లి, కొల్లోనిమొర్లతండా, గుట్టకాడితండా, మక్తపల్లి, యాసాయకుంటతండా, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో పడమటి గార్లపాడు, వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని మల్లాయిపల్లి తండా, దొండాయిపల్లి తండా, కిష్టాపూర్‌, గురి గింజమిట్ట తండాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు.

కరోనాకు దూరంగా ముక్రా(కే)

ఆదిలాబాద్‌, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ విశ్వరూపం చూపుతున్నా.. ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో ఇప్పటికీ ఒక్క కేసు నమోదు కాలేదు. కరోనా కట్టడికి పంచాయతీ పాలకవర్గం చేపడుతున్న చర్యలకు గ్రామస్థులు సంపూర్ణ సహకారం అందిస్తుండటంతో ఇది సాధ్యమవుతున్నది. గ్రామ పంచాయతీ నిధులతో థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌ను కొనుగోలు చేశారు. సర్పంచ్‌, కార్యదర్శి, ఎంపీటీసీ, ఆశ కార్యకర్త, ఇతర సభ్యులు వారానికి రెండుసార్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తున్నారు. అవసరమైన వారికి ఆశ కార్యకర్త మందులు పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు గ్రామ సరిహద్దులో చెక్‌పోస్టును ఏర్పాటుచేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారి వివరాలను నమోదు చేస్తున్నారు. వారు తిరిగొచ్చినప్పుడు థర్మల్‌ మీటర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎవరైన అస్వస్థతకు గురైతే వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తీసుకెళ్లేందుకు రెండు ఆటోలను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం సూచనలను పక్కాగా అమలుచేస్తున్నామని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుండటంతో కేసులు నమోదు కావట్లేదని సర్పంచ్‌ మీనాక్షిగాడ్గే తెలిపారు.

అందరి కృషితోనే సాధ్యమైంది
గ్రామస్థులందరి కృషితోనే మా ఊరిలో కరోనా కట్టడి సాధ్యమైంది. ప్రతి రోజు అన్ని వీధుల్లో హైపోక్లోరైట్‌ పిచికారీ చేయిస్తున్నాం. ఆశ వర్కర్లతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం సూచించిన మేరకు ప్రతిఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తున్నారు.
– స్రవంతి, సర్పంచ్‌, సోమక్కపేట, మెదక్‌ జిల్లా

వారానికి రెండుసార్లు శానిటైజేషన్‌
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లతో ఇంటింటికీ తిరుగుతూ కరోనాపై గ్రామస్థులకు కొవిడ్‌పై అవగాహన కల్పించాం. మా గ్రామంలో వారానికి రెండుసార్లు హైపోక్లోరైడ్‌ పిచికారీ చేయిస్తున్నాం. కరోనా నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాం. పంచాయతీ తీర్మానాలను పక్కాగా అమలుచేస్తున్నాం. – ప్రవీణ్‌, పంచాయతీ కార్యదర్శి, వసురాంతండా, మెదక్‌ జిల్లా

నిత్యం పనుల్లోనే..
తుంగభద్ర నది తీరంలో మా గ్రామం ఉంది. మేము నిత్యం సాగు పనుల్లోనే బిజీగా ఉంటాం. అత్యవసరమై తేనే ఊరుదాటి వెళ్తాం. కరోనా వచ్చినప్పటి నుంచి గ్రామంలో జాగ్రత్తలు పాటిస్తున్నాం. మాస్కులు, శానిటైజర్‌ వాడుతూ భౌతికదూరం పాటిస్తున్నాం. దీంతో గ్రామంలో ఒక్క కొవిడ్‌ కేసు లేదు.
-వీరాంజనేయులు, పడమటి గార్లపాడు, జోగులాంబ గద్వాల జిల్లా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ ఊర్లకు కరోనా రాలె

ట్రెండింగ్‌

Advertisement