సిటీబ్యూరో, ఏప్రిల్ 24 ( నమస్తే తెలంగాణ ) : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటగా.. హైదరాబాద్ విద్యార్థులు నిరాశ పర్చారు. రంగారెడ్డి జిల్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ 71.7 శాతంతో ప్రథమ స్థానంలో, సెకండ్ ఇయర్ 77.63 శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది. మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 71.58 శాతం, సెకండ్ ఇయర్ 78.31 శాతం ఉత్తీర్ణత పొందారు.
హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.91 శాతం ఉత్తీర్ణతతో పదవ స్థానంలో నిలువగా, ద్వితీయ సంవత్సరంలో 65.95 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 1,57,667 మంది పరీక్షకు హాజరుకాగా 99,101 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు రెండింటిలోనూ బాలికలదే హవా కొనసాగింది.