సంగారెడ్డి, జూలై 3(నమస్తే తెలంగాణ)/పటాన్చెరు/పటాన్చెరు రూరల్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ప్రమాద ఘటనలో ఇంకా 10మంది కార్మికుల జాడ కనిపించడం లేదు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావడం లేదు. జాడలేకుండా పోయిన 10 మంది మృతి చెందారా? బతికి ఉన్నారా? అన్నదీ తెలియరావడం లేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు గురువారం కూడా సిగాచి పరిశ్రమ ఎదుట రోజంతా తమ వారి గురించి జాడ దొరుకుతుందేమోనని వేచిచూస్తూ గడిపారు. ఒక దశలో బాధిత కుటుంబ సభ్యులు సహనం కోల్పోయి పరిశ్రమ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకోవంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది. బండ్లగూడకు చెందిన జస్టిన్ మృతదేహం కోసం గత నాలుగు రోజులుగా వేచిచూస్తున్న కుటుంబసభ్యులు కంపెనీ గేటు వద్ద ఏకంగా ఆందోళనకు దిగారు. జస్టిన్ తండ్రి రాందాస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన కొడుకు జాడ చెప్పాలని, లేదంటే మృతదేహమైనా అప్పగించాలంటూ ఆగ్రహానికి గురైన రాందాస్ పరిశ్రమ గేటు వద్ద ఉన్న చెట్టుకు తలను బాదుకున్నాడు. దీంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. దీంతో వెంటనే పోలీసులు ఆయనకు ప్రథమ చికత్స అందించి కుటుంబ సభ్యులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు.
జాడలేకుండా పోయిన ఆ 10 మంది ఏమయ్యారనేది తెలియక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావడం లేదు. ప్రమాదంలో మృతుల సంఖ్య 50 దాటిందని తెలుస్తున్నది. అధికారులు మాత్రం మృతుల సంఖ్యను ఇప్పటికీ అధికారికంగా ప్రకటించడమే లేదు.
సిగాచి పరిశ్రమ శిథిలాల నుంచి సహాయక చర్యల్లో మాంసపు ముద్దలే బయటపడుతున్నాయి. ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్ బృందా లు శిథిలాలను తొలగిస్తున్నాయి. శిథిలాలను పరిశ్రమ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వేసి ఆనవాళ్ల కోసం వెతికారు. ఈ క్రమంలో మృతుల అవయవ భాగాలు, కార్మికుల గుర్తింపు కార్డు లు, పర్సులు, నగదు, కళ్లద్దాలు ఇతర సామగ్రి వెలికి వచ్చాయి. భారీ పేలుడుతో శరీరాలు ఛిద్రమయ్యాయి. కాలిపోవడంతో కొన్ని శరీర భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో అయినవారి జాడలేక కంపెనీ చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్న కార్మికుల కుటుంబసభ్యులు అల్లాడిపోతున్నారు.
గుర్తింపు సామగ్రిని వారి కుటుంబ సభ్యులు గుర్తుపట్టేలా అధికారులు ప్రదర్శిస్తున్నారు. అక్కడ దొరికిన ఎముకలు, అవయవ భాగాలను పటాన్‌చెరులోని మార్చురీకి తరలిస్తున్నారు. వాటి నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారు. సహాయ కార్యక్రమాల్లో ఇద్దరి మృతదేహాలు లభించినట్టు తెలిసింది. అయితే అధికారులు మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. ఆ 10 మంది ఆనవాళ్లను గుర్తించేందుకు శుక్రవారం కూడా సహాయ చర్యలు కొనసాగే అవకాశం ఉన్నది. గురువారం డీఎన్ఏ పరీక్ష ఫలితాల ద్వారా మరో 11మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గురువారం డీఎన్ఏ పరీక్షల ద్వారా చోటేలాల్ కోల్, రమేశ్‌గౌడ, దిలీప్ గోసాయి, సిద్ధార్థగౌడ, శ్యాంసుందర్ తుడు, సందీప్ సర్కార్, దీపక్, అజయ్ మండల్, చైతు భత్య, అతుల్‌కుమార్, నాగపాశ్వాన్ మృతదేహాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్రావు, సభ్యులు డాక్టర్ టీ ప్రతాప్‌కుమార్, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సంతోష్ గుగే మూడు గంటలపాటు కంపెనీలో తనిఖీలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ర్టాల అధికారుల బృందాలు పరిశ్రమను పరిశీలించి, బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమని పట్టించుకోవడంలేదని శ్రీకాకుళానికి చెందిన కృష్ణమురళీకృష్ణ తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రాంత కార్మికులు, సిబ్బందిని ఆదుకునేలా ఇప్పటికైనా చంద్రబాబు, పవన్‌కల్యాణ్, ముందుకు రావాలని కోరారు.
తొర్రూరు, జూలై 3: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఆరునెలల క్రితమే పెళ్లయిన అఖి ల్ అసువులు బాసాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లికి చెందిన అఖిల్ (29) తన సొంత మరదలు శివరాణిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. సిగాచిలో పనిచేస్తూ, భార్య, తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. పేలుడు జరిగిన రోజు ఉదయం అఖిల్ విధులకు వెళ్లాడు. భారీ పేలుడులో అఖిల్ మృత్యువాత పడ్డాడు. మృతదేహం లభించకపోవడంతో డీఎన్ఏ పరీక్ష కోసం పంపినట్టు అతడి మేనమామ నగేశ్ తెలిపారు.