Students | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఒత్తిడికి వైద్య విద్యార్థులు చిత్తవుతున్నారు. ఒత్తిడిని అధిగమించలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుని జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. పోటీ వాతావరణం, పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయం, ఆత్మన్యూనత, భయం, ఒత్తిడి పని వేళలు, అకడమిక్ సిలబస్ ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, ప్రతికూల పని వాతావరణం ఆత్మహత్యలకు కారణం అవుతున్నది. యునైటెడ్ డాక్టర్ల ఫ్రంట్(యూడీఎఫ్) ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఇచ్చిన సమాధానంలో వైద్య విద్యార్థుల ఆత్మహత్యలపై సంచలన విషయాలు వెలుగుచూశాయి.
గత ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. వీరిలో 64 మంది ఎంబీబీఎస్, 55 మంది ఎండీ/ఎంఎస్ చదువుతున్న విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించింది. ఈ ఐదేండ్ల వ్యవధిలోనే దేశంలోని 512 కాలేజీల్లో 1,116 మంది వైద్య విద్యార్థులు డ్రాపౌట్ అయినట్టు ఎన్ఎంసీ స్పష్టం చేసింది. వీరిలో 160 మంది ఎంబీబీఎస్, 956 మంది పీజీ విద్యార్థులు ఉన్నట్టు తెలిపింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఆయా మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ నిర్లక్ష్యంపై గ్రీవెన్స్‌లకు 1,680 ఫిర్యాదులు అందినట్టు ఎన్ఎంసీ పేర్కొంది.
హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా యువ వైద్యుల్లో పనిభారం తగ్గించడం పట్ల నిర్లక్ష్యం, మానసిక ఒత్తిళ్లను గుర్తించడంలో ఉదాసీనత కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నదని వైద్య నిపుణులు చెప్తున్నారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులపై కఠినంగా వ్యవహరించడం, ఒత్తిడి గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించడం, యోగా, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి వైద్య కళాశాలల్లో ప్రత్యేకంగా నిపుణులను నియమించడం, ఆత్మ న్యూనత భావాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉన్నది.
కఠినమైన సిలబస్, ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామన్న భయం, పరీక్షల ఒత్తిడి వైద్య విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి మెడికల్ కాలేజీలో మెంటల్ హెల్త్ సెల్స్, కౌన్సెలింగ్ ఫెసిలిటీలు ఏర్పాటు చేయాలి. యోగా, ధ్యానం, ఆటలు, హాలీడేలు వంటి రీఫ్రెష్ యాక్టివిటీలను ప్రోత్సహించాలి. విద్యార్థుల ఒత్తిడిని అధ్యాపకులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రేమతో మానసిక ప్రోత్సాహం అందించాలి. విద్యార్థులు సమయానికి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం అలవర్చుకోవాలి. ఆత్మన్యూనత భావనలు కలిగి ఉన్న విద్యార్థులకు ప్రొఫెషనల్ సాయాన్ని అందించాలి.
-ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల (ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీ)