హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ 2024-25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తమ పేర్లను వెంటనే ఎన్ఎంసీ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని జాతీయ వైద్యమండలి సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్సైట్లో పేర్లు ఉన్న వాళ్లు మాత్రమే ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంటుందని స్పష్టంచేసింది. కొన్ని కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్ల వివరాలను వెబ్సైట్లో పొందపర్చలేదని, మరికొన్ని కాలేజీలు అసంపూర్తిగా వివరాలను పొందుపర్చినట్టు ఎన్ఎంసీ తెలిపింది. వెబ్సైట్లో వివరాలు లేని వారు వెంటనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) లేదా సంబంధితశాఖ అధికారులను సంప్రదించాలని ఉత్తర్వుల్లో కోరింది.
సమ్మర్ క్యాంపుల పైసలేవీ.. ?
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో సమ్మర్ క్యాంపులు పెట్టండి.. 15 రోజులకు రూ.50 వేలు ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. కానీ ఇంతవరకు రూపాయి విడుదల చేయలేదు. ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకంతో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చుచేశారు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యాశాఖ తొలిసారిగా సమ్మర్ క్యాం పులు నిర్వహించింది. 18 జిల్లాల్లోని 656 బడుల్లో మే 1 నుంచి 15 వరకు నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ పద్ధతిలో సమ్మర్ క్యాంపులు నిర్వహించింది. వీటి నిర్వహణకు ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున అందజేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. నలుగురు వలంటీర్లకు మూడు వేల చొప్పున రూ.12వేలు, వంద మందికి స్నాక్స్ కింద తలా రూ.15 చొప్పున రూ.22,500, కుక్ కమ్ హెల్పర్ పారితోషికం కింద రూ.రెండువేలు, కలర్స్, స్కెచ్ల కోసం రూ.10వేలు, ఇతర ఖర్చుల కింద రూ.3,500 చొప్పున ఖర్చుచేసుకోవచ్చని చెప్పింది. ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఈ క్యాంపుల నిర్వహణకు రూ.3.28 కోట్లు కూడా మంజూరుచేసింది. క్యాంపులు ముగిసి 15 రోజులు దాటినా ఆ పాఠశాలలకు ఇంతవరకు ఈ డబ్బులు విడుదల చేయలేదు.