సారంగాపూర్, నవంబర్ 25: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ మండలం పాల్దాలో మంగళవారం డబుల్బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పేదలకు ఉచితంగా కరెంటు ఇస్తున్నదని చెప్పగా.. అక్కడే ఉన్న మల్లారం నరేందర్ తాను ఉచిత కరెంటుకు అర్హుడినయినా జీరో బిల్లు రావడం లేదని తెలిపాడు. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తున్నదని కల్లెడ మారుతి గట్టిగా అరిచాడు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురికాగా స్టేజీపైన ఉన్న కాంగ్రెస్ నాయకులు కిందికి దిగి వచ్చి ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగారు.
ఓ కాంగ్రెస్ నాయకుడు నరేందర్‌పై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని చెదరగొట్టారు. అకారణంగా తమపై చేయిచేసుకోవడం ఏమిటని బాధితులు నరేందర్, మారుతి ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామానికి 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయగా.. 24 పూర్తయ్యాయి. మిగిలినవి అసంపూర్తిగా ఉండగా.. వాటిని లాటరీ పద్ధతిలో కేటాయించడం గమనార్హం.