హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ఎక్సైజ్ కమిషనర్ అవమానాలపై తనను సంప్రదించకుండానే సమస్య సమసిపోయిందని జేఏసీ నాయకులు ప్రకటన విడుదల చేయడం తనను మరింత బాధకు గురి చేసిందని నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. కానిస్టేబుళ్ల బదిలీల సందర్భంగా జరిగిన ఘటనలో తాను పొందిన అవమానం, ఆ సమస్య తన ఒకడిదిగా భావించలేదని అన్నారు. తన కన్నా ముందు కమిషనర్ గదికి వెళ్లి వచ్చిన అందరి అధికారులను చాలా ఘోరంగా, అవమానకరంగా దూషించారని, అదే క్రమంలో తనని కూడా తీవ్రంగా దూషించారని చెప్పారు.
అది తన ఒకడి సమస్య కానే కాదని, సిబ్బంది, అధికారులు, ఉన్నతాధికారులు అందరూ ఆయన తిట్ల పురాణానికి బాధితులేనని చెప్పారు. పని ఒత్తిడిలో సోమిరెడ్డిని తిట్టానని కమిషనర్ విచారం వ్యక్తం చేయడం తాత్కాలిక ఉపశమనమేనని పేర్కొన్నారు. తనకన్నా ముందుగా దూషణలకు గురైన జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు మనుషులు కారా? వారికి వ్యక్తిత్వం లేదా? వారి విషయంలో ఎటువంటి విచారం వ్యక్తం చేయలేదు ఎందుకు? అని ప్రశ్నించారు.
కమిషనర్ గదిలో 10 నిమిషాలపాటు ‘వెధవ’ అనే పదం పదే పదే అనడం, తనతోనే ఆ పదం చెప్పించాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఉన్న జిల్లా, డివిజన్ అధికారి, ఈఎస్‌లు, ఏసీలు, డీసీలు, జేసీఏసీలు.. తాజాగా కమిషనర్‌ను కలిసిన జేఏసీలో లేరని తెలిపారు. ఎవరి కోసం ఎవరు ప్రకటన ఇచ్చారని, ఇది బాధితుల మీదనే మళ్లీ దాడి చేసేట్టుగా ఉన్నదని వాపోయారు. గతేడాది నుంచి కమిషనర్ ఆఫీసులో పని చేస్తున్న ప్రతి ఒకరూ కమిషనర్ ద్వారా అవమానం పొందినవారేనని చెప్పారు. తాను బతికి ఉన్నాను కాబట్టే.. ఈ మాటలు చెప్పగలుగుతున్నానని, లేదంటే కమిషనర్ ఏ తప్పు చేయలేదు అని నిరూపణ చేసేవారని, ఒక వ్యక్తికి ఆత్మాభిమానం మించిన జీవితం లేదని నమ్ముతున్నట్టు తెలిపారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి తన బాధ చెప్పుకోనున్నట్టు పేర్కొన్నారు.