ఆందోళన బాట పట్టిన విద్యార్థులు
మెస్ తెరవకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక
Nizam College | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని నిజాం కళాశాల విద్యార్థుల హాస్టల్ మెస్‌ను అధికారులు రెండు రోజుల క్రితం మూసివేశారు. రెండు రోజుల నుంచి ఆహారం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరికి శుక్రవారం ఆందోళనకు దిగారు. తార్నాకలోని ఇంటర్నేషనల్ హాస్టల్లో నిజాం కళాశాల విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించి, అందులోనే వారికి మెస్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో అధికారులకు మెస్‌ను నడపడం భారంగా మారింది. మరోవైపు మెస్‌కు నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వారు సైతం తమ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో సరఫరా నిలిపివేశారు.
ఆందోళన చేపట్టిన విద్యార్థులు మాట్లాడుతూ మెస్ మూసివేతపై కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా నిధుల కొరతతో మూసివేసామని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరతతో విద్యార్థులు ఆకలితో అలమటించాలా అని ప్రశ్నించారు. కళాశాలకు నిధుల కొరత ఉన్న వర్సిటీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన నిజాం కళాశాల విద్యార్థులకు కాంగ్రెస్ పాలనలో భోజనం పెట్టలేని దుస్థితి నెలకొందని వాపోయారు. తక్షణమే తిరిగి పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులందరూ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తక్షణమే ఈ సమస్యపై వర్సిటీ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందించాలని కోరారు. లేనిపక్షంలో వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల తో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Nizamcollege1