హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ‘నెక్నాంపూర్ చెరువు’ పునరుజ్జీవం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో అమలవుతున్న నీటి నిర్వహణ విధానాలను పరిశీలించిన నీతి ఆయోగ్.. ఉత్తమ విధానాలను ఎంపిక చేసి వాటిని ‘బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ 3.0’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఇందులో నెక్నాంపూర్ చెరువు పునరుజ్జీవాన్ని ప్రత్యేకంగా కొనియాడింది. హైదరాబాద్ సమీపంలోని ఐదు గ్రామాల్లో అమలు చేసిన వాటర్‌షెడ్ పథకంతో అద్భుత ఫలితాలు వచ్చాయని ప్రశంసిస్తూ ఇతర రాష్ర్టాలు వీటిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది.
ప్రభుత్వ పట్టుదల.. ఎన్జీవో కృషి.. స్థానికుల సహకారం
జీహెచ్ఎంసీ 2016లో నెక్నాంపూర్ చెరువు పునరుద్ధరణకు నడుంబిగించింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కాలుష్య కాసారంగా మారింది. గుర్రపు డెక్కతో నిండిపోయింది. స్థానికులు, కంపెనీలు, పౌల్ట్రీల వ్యర్థాలతో చెరువు దర్గంధాన్ని వెదజల్లేది. దీనిని ఇలా వదిలేయకుండా పునరుద్ధరించాలని, స్వచ్ఛమైన జీవావరణ వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకు స్వచ్ఛంద సంస్థ ‘ధృవన్ష్ ఆర్గనైజేషన్’ ముందుకొచ్చింది. చెరువు రూపురేఖలు మార్చడంతోపాటు స్థానికులకు అవగాహన కల్పించే బాధ్యతను తీసుకుంది.
చెరువు చుట్టూ ఆయుర్వేద మొక్కలు
చెరువు పునరుద్ధరణలో భాగంగా తొలుత చెరువు కట్టను పటిష్ఠం చేసి అందులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను ఫ్లోటింగ్ బైక్స్ సాయంతో తొలగించారు. చెరువు చుట్టు ఆయుర్వేద మొక్కలు, హానికారక రసాయనాలను తొలగించే పైటోరెమిడియేషన్ మొక్కలు నాటారు. చెరువులోకి వచ్చి చేరే నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీపీలను నిర్మించారు. చెరువు చుట్టూ ఉన్న నివాస ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రతి నెల చెరువు నీటి నమూనాలను సేకరించి, నాణ్యతను పరీక్షిస్తున్నారు. చెరువు చుట్టూ మొక్కలు నాటి పచ్చదనం నింపారు. వాటికి కావాల్సిన ఎరువును చెరువులో నుంచి వెలికితీసిన వ్యర్థాల నుంచే తయారు చేశారు. ఇప్పటికీ చెట్ల ఆకులు, ఇతర వ్యర్థాల నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. సందర్శకుల కోసం చెరువు దగ్గర ప్రత్యేకంగా గార్డెన్ ఏర్పాటు చేశారు.
ఆహ్లాదకరమైన వాతావరణం
ప్రభుత్వ పట్టుదల, ధృవన్ష్ సహకారం, స్థానికుల సమిష్టి కృషి ఫలితంగా ఇప్పుడు నెక్నాంపూర్ చెరువు కాలుష్యరహితంగా మారింది. 2016కు ముందుతో పోల్చితే చెరువు నీటిలోని రసాయన కలుషితాలు (బీవోడీ) 90 శాతం తగ్గినట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొన్నది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చిన నివేదిక ప్రకారం నీటి పీహెచ్ 7.1గా ఉన్నది. అంటే పరిశుభ్రంగా ఉన్నట్టు లెక్క. చెరువు అవసరాలకు కావాల్సిన విద్యుత్తును సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. వాకింగ్, జాగింగ్, యోగా ప్రాక్టీస్‌తోపాటు కుటుంబంతో సహా వచ్చి సేదతీరడానికి చెరువు వేదికైంది. వాటర్ ఫౌంటేన్లు, బోటింగ్, రంగురంగుల పూల మొక్కలు, చెట్లు, గార్డెన్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ప్రతి వారం చెరువు పార్కులో సాంస్కృతిక కార్యక్రమాలు, సైక్లిం గ్, ఈ-బైక్‌ల ప్రదర్శన, నేల దినోత్సవం, నీటి దినోత్సవం వంటివి నిర్వహిస్తున్నారు. ప్రతి నెల ఆఖరి ఆదివారం స్థానికులు ప్రత్యేకంగా చెరువు పరిశుభ్రత డ్రైవ్‌లో పాల్గొంటారు. చెరువుకు ఎక్కడా గేట్లుకానీ, సెక్యూరిటీ గార్డు లు కానీ ఉండరు. అయినా చెరువు పరిసరాల్లో ఎక్కడా చెత్తా చెదారం కనిపించదు.
‘తేలియాడే నేల’ మరో ప్రత్యేకం
నెక్నాంపూర్ చెరువు నీటిని శుద్ధి చేయడంలో భాగంగా ‘ఫ్లోటింగ్ ట్రీట్మెంట్ వెట్‌ల్యాండ్’ అనే పద్ధతిని వినియోగించారు. వెదురు కర్రలతో ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసి దానిపై థర్మోకోల్ పొర వేశారు. దాని మధ్యలో గుంతలు చేసి మట్టి, ఇతర పోషకాలను నింపారు. పైన మరో పొర వెదురు కర్రలను ఏర్పాటు చేసి మధ్యలో ఉన్న గుంతల్లో నీటిలోని రసాయనాలను పీల్చి శుభ్రం చేయగలిగే మొక్కలను పెంచారు. ఇది చెరువులో తేలియాడుతూ ఉంటుంది. నీళ్లలోని హానికారక పదార్థాలను మొక్కలు పీల్చడంతోపాటు నీటిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. సుమారు 3వేల చదరపు అడుగు ఫ్లోటింగ్ ట్రీట్మెంట్ వెట్ల్యాండ్ను చెరువులో ఏర్పాటు చేశారు. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
వాటర్ షెడ్ పనులతో అద్భుత ఫలితాలు
హైదరాబాద్ సమీపంలోని ఐదు గ్రామాల్లో ‘నేషనల్ ఆగ్రో ఫౌండేషన్’ అనే సంస్థ చేపట్టిన వాటర్ షెడ్ పనులతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నీతి ఆయోగ్ పేర్కొన్నది. 2021లో నోవార్టిస్ సంస్థ నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఐదు గ్రామాల్లో వాటర్ షెడ్ పనులకు శ్రీకారం చుట్టిందని వివరించింది. నీటి లభ్యతను పెంచడం, నాణ్యతను పెంచడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, ఆర్థిక వనరులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న స్కూళ్లలో తాగునీటి సౌకర్యం, శానిటేషన్ సదుపాయాలు కల్పించారు. స్థానికుల్లో భూములు లేనివారికి ఇంటి వెనుక పశువులు, కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు. ఆదాయాన్ని ఇచ్చే 3 వేల మొక్కలను నాటారు. రైతులకు నీటిని నిల్వ పద్ధతులు, తక్కువ నీటితో వ్యవసాయం చేసే విధానాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా పొందే మార్గాలను వివరించారు. వీటన్నింటి ఫలితంగా అద్భుత ఫలితాలు వచ్చాయని నీతి ఆయోగ్ తెలిపింది.
ఉత్తమ జీవావరణ వ్యవస్థ
చుట్టూ కట్ట కట్టి, నీళ్లు శుభ్రం చేస్తే చెరువు బాగుపడ్డట్టు కాదు. చెరువు అంటే నీళ్లు, చేపలు మాత్రమే కాదు. అదొక జీవావరణ వ్యవస్థ. బ్యాక్టీరియా, నాచు మొదలు చేపలు, కప్పలు, తాబేళ్లు వంటి నీటిలో జీవించగలిగే ప్రాణులు ఉండాలి. అవి జీవించగలిగేలా నీళ్లలో తగినన్ని పోషకాలు ఉండాలి. వాటికి సరిపడా ఆహారం దొరకాలి. ఎనిమిదేండ్ల కృషితో నెక్నాంపూర్ చెరువులో ఈ తరహా జీవావారణ వ్యవస్థను పునరుద్ధరించాం. ఇప్పుడు చెరువులో చేపలు కప్పలతోపాటు మూడు రకాల తాబేళ్ల జాతులు నివసిస్తున్నాయి. ప్రభుత్వం, స్థానిక ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ‘డైల్యూషన్ ఈజ్ సొల్యూషన్ ఫర్ పొల్యూషన్’ అనే విధానంలో చెరువును బాగుచేశాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17 అంశాలను నెక్నాంపూర్ చెరువు సాధించింది. ఇటీవలే కేరళకు చెందిన 20 మంది విద్యార్థులు వచ్చి ఏడు రోజులపాటు ఇక్కడే ఉండి అధ్యయనం చేసి వెళ్లారు.
– మధులిక చౌదరి, ధృవన్ష్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు