Aadhar for Animals | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. వ్యాధి పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్‌ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై చర్చ నిర్వహించారు. దీనికి సీఎంసీ వెల్లూరు ప్రొఫెసర్ డాక్టర్ గగన్‌దీప్ కంగ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వీకే పాల్ మాట్లాడుతూ.. మనుషులకు ఇచ్చినట్టుగానే పశువులకు పశు ఆధార్‌ను రూపొందించామని చెప్పారు. త్వరలో ప్రతి పశువు, జంతువుకు ఆధార్ నంబర్ ఇవ్వనున్నామని తెలిపారు. దీని ద్వారా దేశంలో పశువులు, జంతువుల వివరాలు సులభంగా లభ్యమవుతాయన్నారు. ఆ తరువాత ఆ వివరాలను డిజిటలైజ్ చేస్తామని చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్ సమయంలో దేశం, ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని అన్నారు. సమాచారం పరంగా ప్రపంచ దేశాలు డాటాను పంచుకోవడంలో సమయానుకూలంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీ సమయంలో త్వరితగతిన క్లియరెన్స్‌లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా తరువాత ఔషధాలు, బయోమెడికల్ పరికరాలలో అద్భుతమైన మార్పులు జరిగాయని చెప్పారు. వ్యాధులకు సంబంధించి ప్రజలకు సమాచారం అందించడం చాలా ముఖ్యమని అన్నారు. దేశంలో 1.7 కోట్ల మంది గిరిజనులకు సికిల్ సెల్ వ్యాధిపై పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్త్తున్నామని చెప్పారు. సమర్థమైన, వేగవంతమైన రోగనిర్ధారణ ద్వారా మరిన్ని వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు.
జబ్బులు రావచ్చు, కానీ మౌలిక సదుపాయాలు, చికిత్స, నివారణ లేకపోతే ఆ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.సైన్స్ సరిహద్దులను అధిగమించాలని, మన ఆలోచనా దృక్పథం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
– సమిత్ హీరావత్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్
మహమ్మారి జంతువులు, పశువులకు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఆలోచించాలి. ఈ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా కంపెనీ చేసే ఆలోచనలు, దృక్పథానికి ప్రపంచ ఏజెన్సీల నుండి సహాయం కావాలి.
– సాయి ప్రసాద్, ఈడీ, భారత్ బయోటెక్
డ్రగ్స్, లాజిస్టిక్స్‌లో రియల్ టైమ్ డాటా అవసరం. కమ్యూనిటీ సైన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. యూనిసెఫ్ ప్రపంచంలోని అందరికంటే ఎకువ వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తున్నది. కరోనా అనేక పాఠాలను నేర్పించింది.
– సైంతియా, యూనిసెఫ్ ప్రతినిధి