గద్వాల, ఏప్రిల్ 9 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభలో గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ మాటలు వింటే అధికార పార్టీ నాయకుల గుండెలు హడలెత్తిపోవాల్సిందేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో నియోజకవర్గ నేత బాసు హనుమంతు అధ్యక్షతన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి తరానికి జరిగే మేలు గురించి ఈ సభలో కేసీఆర్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ ఒకే గొడుగు కింద పని చేసే పార్టీలని ఎద్దేవా చేశారు. వారి టార్గెట్ కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ప్రస్తుత పరిస్థితుల్లో బై ఎలక్షన్లలో కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టంచేశారు. స్థానికసంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా గద్వాల కోటపై గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ గుర్తుమీద గెలిచి ద్రోహం చేసిన వ్యక్తులకు బుద్ధి చెప్పాలని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, వారిని కాపాడుకునే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.