హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్తచరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించిన పవిత్రమైన రోజు.. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా ఫిబ్రవరి 20న బిల్లును ఆమోదించింది. అక్కడి నుంచి 2014 మార్చి 1 దాకా.. రాష్ట్రపతి ఆమోదముద్ర పడే వరకూ నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది.
ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష అక్షర రూపం దాలుస్తూ.. 2014 మార్చి 1న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాజముద్ర పడింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన అనంతరం రాష్ట్ర ఆవిర్భావ (అపాయింటెడ్ డే) దినోత్సవంగా జూన్ 2న ప్రకటించడం ఓ అపూర్వ ఘట్టం. ఉద్యమ రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 జూన్ 2న కొలువుదీరడంతో తెలంగాణ రాష్ర్టానికి సువర్ణాధ్యాయం మొదలైంది.