హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహిళలకు నెలసరిలో ఎదురయ్యే సమస్యలను పోషకాహారంతో కట్టడి చేయవచ్చని జాతీయ పోషకాహార సంస్థ-ఎన్ఐఏ పరిశోధకులు తెలిపారు. మేలైన ఎంజైమ్‌లు కలిగిన గడ్డితో మోనోపాజల్ సిండ్రోమ్‌కు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఎన్ఐఎన్ మాజీ పరిశోధకుడు డాక్టర్ దినేశ్‌కుమార్ సారథ్యంలో డాక్టర్ వందనసింగ్ ఆవిష్కరించిన ఫుడ్ ఫార్ములేషన్‌కు పేటెంట్‌కు లభించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 120 కోట్ల మంది మహిళలు మోనోపాజల్ సిండ్రోమ్ బారినపడే అవకాశముందని అంచనా వేశారు.
ఈ సమస్యల కోసం హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అందుబాటులో ఉందని, ప్రకృతి సిద్ధమైన పరిష్కారంగా ఈ గ్రాస్బేస్డ్ పోషకాలు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ వందనసింగ్ చాలామంది బాధితులకు వైద్యం చేసిన అనుభవంతో న్యూట్రిషన్ ఫుడ్ రూపొందించినట్టు ఎన్ఐఎన్ వర్గాలు తెలిపాయి. ఈ న్యూట్రిషన్ ఫార్ములేషన్‌కు పేటెంట్ హక్కులను సొంతం చేసుకున్నారని వెల్లడించారు.