ఖైరతాబాద్, జూన్ 14: సాధారణంగా మనిషి శరీరంలో మూత్రపిండాలు నడుము వెనక భాగంలో ఉంటాయి. కానీ, ఒక వ్యక్తికి ఎడమ వైపు మూత్రపిండం.. ఉండాల్సిన స్థలంలో కాకుండా గుండె, ఎడమ ఊపిరితిత్తుల వెనక ఏర్పడింది. దానికి తోడు ఆ మూత్రపిండంలో రాళ్లు ఏర్పడ్డాయి. అంతేకాదు- మూడేండ్ల క్రితం మూత్రనాళానికి వేసిన స్టంట్ విరిగిపోయింది. దాని చుట్టూ రాళ్లు ఏర్పడ్డాయి. అవయవాల అమరికలోనే తేడా ఉన్న ఆ యువకుడికి శస్త్ర చికిత్స చేసి, రాళ్లను తొలగించడం పెద్ద సవాల్. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణం పోయే ప్రమాదం ఉన్నది. ఈ చాలెంజ్‌ను స్వీకరించిన నిమ్స్ దవాఖాన వైద్యులు రాళ్లను తొలగించి, అతడి ప్రాణాలను కాపాడారు.
అదీ పూర్తి ఉచితంగా.
కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి(25)కి మూడేండ్ల క్రితం బ్లాడర్‌లో రాయి ఏర్పడింది. వైద్యులు ఎండోస్కోపీ ద్వారా ఆ రాయిని తొలగించారు. ఆ సమయంలోనే బ్లాడర్-మూత్రపిండానికి మధ్యలో ఉండే మూత్రనాళానికి స్టంట్ వేశారు. అయితే, ఆ యువకుడు రెండు వారాల క్రితం తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో పాటు మూత్రంలో మంట ఉన్నదని నిమ్స్ దవాఖానకు వచ్చాడు. నిమ్స్ వైద్యులు సీటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలను చూసిన యూరాలజీ, మూత్రపిండ మార్పిడి విభాగం వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
నడుము వెనక ఉండాల్సిన ఎడమ మూత్రపిండం ఆ యువకుడికి గుండె, ఎడమ ఊపిరితిత్తుల వెనక ఉన్నదనే విషయాన్ని గుర్తించారు. ఆ మూత్రపిండంలో రాళ్లు ఏర్పడ్డట్టు గుర్తించారు. దీంతోపాటు మూడేండ్ల కిందట మూత్రనాళానికి వేసిన స్టంట్ సైతం విరిగిపోయి దాని చుట్టూ కూడా రాళ్లు ఏర్పడ్డాయని నిర్ధారించారు. దీంతో యూరాలజీ, మూత్రపిండ మార్పిడి విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ రాంరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నేతృత్వంలో డాక్టర్ రంగనాథ్, డాక్టర్ నిర్మల, డాక్టర్ ధీరజ్ బృందం ఈ కేసును సవాల్‌గా స్వీకరించి శస్త్ర చికిత్స చేశారు.
ఆధునిక చికిత్సా విధానంలో ఆ రాళ్లను తొలగించారు. కీహోల్ ఎండోస్కోపీ ద్వారా రెండు గంటల పాటు శ్రమించి, వీడియో అసిస్టెట్ థోరాస్కోపిక్ సర్జరీ విధానంతో మూత్రపిండంలోని రాళ్లను తొలగించారు. దాంతో పాటు విరిగిపోయిన స్టంట్, దాని చుట్టూ పేరుకుపోయిన రాళ్లను తీసివేశారు. ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స సమయంలో గుండెకు చిన్న గాయమైనా రోగి ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువని, కానీ చిన్న సమస్య కూడా తలెత్తకుండా శస్త్ర చికిత్స పూర్తి కావడం చాలా సంతోషంగా ఉన్నదని వైద్య బృందం తెలిపింది. కార్పొరేట్ దవాఖానల్లో లక్షల్లో ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి ఉచితంగా చేసినట్టు వైద్యులు తెలిపారు.
గుండె వెనుక కిడ్నీ.. ఇదీ కారణం
ప్రపంచంలో కోట్లాది మందిలో ఒకరికి గుండె వెనుక వైపు కిడ్నీ ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. జన్యుపరమైన లోపాల వల్ల కిడ్నీలు గుండె వెనుక వైపు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. కాకపోతే వీరు కూడా సాధారణంగానే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారు. ఆ అరుదైన అవయవాల అమరిక అనేది వారికి ఇబ్బందిని కలిగించదని చెప్పారు.
ఇది సాహసోపేత ఆపరేషన్
గుండె వెనుక కిడ్నీ ఉండటం ప్రపంచంలోనే చాలా అరుదు. ఇలాంటి వారికి శస్త్రచికిత్స చేయాలంటే అది ఎంతో సాహసంతో కూడుకున్న పని. వృత్తిపై ఉన్న నమ్మకం, ప్రభుత్వం, నిమ్స్ యాజమాన్యం ప్రోత్సాహంతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేయగలిగాం. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌కు కృతజ్ఞతలు.
– డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్