ఖైరతాబాద్, మే 23: మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స ఒకప్పుడు కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో పేదవారికి సైతం నిర్వహిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నిమ్స్ దవాఖాన యూరాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా 2 వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తిచేసిన సందర్భంగా శనివారం నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేక్ కట్ చేసి వైద్యులకు అందించారు.
యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్దేవ్రాజ్ను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, సీనియర్ ప్రొఫెసర్లు డాక్టర్ గంగాధర్, డాక్టర్ శ్రీభూషణ్ రాజు, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ నిర్మల, డాక్టర్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.