హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): గుండె వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి నిమ్స్ వైద్యులు విజయవంతంగా గుండెమార్పిడి చేశారు. వివరాల్లోకి వెళితే.. అనిల్‌కుమార్ (19) ‘డైలేటడ్ కార్డియో మయోపతి’ అరుదైన గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. అమెరికా వైద్యాధికారుల సహకారంతో ఈనెల 7న గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసి.. బుధవారం డిశ్చార్జ్ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అమరేశ్వర్‌రావు మాట్లాడుతూ అరుదైన డీసీఎం వ్యాధిగ్రస్తుల్లో గుండె పనితీరు రోజురోజుకూ క్షీణిస్తుందని, అలాంటి రోగులకు గుండె మార్పిడి తప్ప మరో మార్గం లేదని తెలిపారు. కార్పొరేట్లో ఈ శస్త్రచికిత్సకు రూ.50లక్షల వరకు ఖర్చవుతుందని, నిమ్స్‌లోని ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా శస్త్రచికిత్స చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు అమరేశ్వర్‌రావు, గోపాల్, కళాధర్ బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అభినందించారు.