హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): నైజీరియా కేంద్రంగా నగరంలో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. టీజీన్యాబ్ పోలీసులు సైబరాబాద్ పోలీసులతో కలిసి ఐదుమంది డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ కేసు పూర్వాపరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఒనౌహ బ్లెస్సింగ్ అలియాస్ జొవాన జొమ్స్ అలియాస్ జో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం రావడంతో టీజీన్యాబ్ పోలీసులతో కలిసి నార్సింగి పోలీసు లు నిఘా పెట్టగా హైదర్షాకోట్లోని విశాల్నగర్లో ఒనౌహా బ్లెస్సింగ్(31), నైజీరియా కు చెందిన అజీజ్ నోహిమ్(29), విశాఖపట్నంకు చెందిన అల్లం సత్యవెంకట గౌతం (31), తూర్పుగోదావరికి చెందిన సానబోయిన వరుణ్‌కుమార్(42), రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్(36) డ్రగ్స్ సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.35 లక్షల విలువ చేసే 199గ్రాముల కొకైన్‌తో పాటు రెండు పాస్‌పోర్ట్‌లు, రెండు బైక్, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి రిమాండ్‌కు తరలించిన పోలీసులు, వీరు ఇచ్చిన సమాచారంతో 13మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించారు. ఇందులో బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌కు చెందిన అమన్‌ప్రీత్ సింగ్, బంజారాహిల్స్‌కు చెందిన అనికేత్‌రెడ్డి, ప్రసాద్, పంజాగుట్టకు చెందిన నికిల్ దావన్, మాదాపూర్‌కు చెందిన మధుసూదన్‌ను అరెస్టు చేసినట్టు డీసీపీ వివరించారు. వీరికి మూత్రపరీక్షలు జరపగా కొకైన్ పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించారు. వీరిలో ఒక ప్రముఖ సినీనటి సోదరుడు కూడా ఉన్నట్టు సమాచారం.