హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం ఏపీ, తెలంగాణలో 62 చోట్ల సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఏకకాలంలో తనిఖీలను ప్రారంభించారు. 2020 నవంబర్ 23న ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టలో పట్టుబడిన మావోయిస్టు సానుభూతిపరుడు పాంగి నాగన్న సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య (పీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చండ్ర నరసింహులును అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఒక పిస్టల్, 14 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన సోదాల్లో రూ.13 లక్షల నగదు, ఇతర ప్రాంతాల్లో మావోయిస్టు సాహిత్యం, పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఏపీలో 53 ప్రాంతాల్లో కూడా సోదా లు నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణలో జిల్లాల్లోని 9 చోట్ల సోదాలు జరిగాయని చెప్పారు. ప్రజా సంఘాల నేతలంతా నిషేధిత మావోయిస్టు పార్టీకి పలు రకాలుగా మద్దతు ఇస్తున్నట్టు తమ సోదాల్లో వెల్లడైందని తెలిపారు. ఎన్ఐఏ అధికారుల సోదాలను ప్రజాసంఘాల నేతలు వేర్వేరుగా ఖండించారు.