RRR | హైదరాబాద్, జనవరి 16(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం వ్యవహారం గందరగోళంగా మారింది. వికసిత్ భారత్-2047 కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో చేపట్టనున్నట్టు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయినా దీనిపై డీఆర్ఎస్ తయారీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. తాము చేపట్టే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎందుకు తయారు చేయిస్తున్నదని ఎన్హెచ్ఏఐ అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఆర్కు అంకురార్పణ జరగ్గా, అప్పటి కేసీఆర్ సర్కారు విజ్ఞప్తిమేరకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
ఇందులో భాగంగా సంగారెడ్డి నుంచి నర్సాపూర్, మాసాయిపేట్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, యాదాద్రి, వలిగొండ మీదుగా చౌటుప్పల్ వరకు 158.65 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం, చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపూర్, చండూరు, మర్రిగూడ, ఆమన్‌గల్లు, కేశంపేట్, షాద్‌నగర్, షాబాద్, చేవెళ్ల, నవాబ్‌పేట మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర దక్షిణ భాగాన్ని నిర్మించాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించారు. రోడ్డును ఉత్తర, దక్షిణ భాగాలుగా కేంద్రం విభజించింది. ట్రాఫిక్ అధ్యయనం ప్రకారం దక్షిణ భాగానికి ఇప్పుడే తొందరేమీలేదని నిర్ణయించి ఉత్తర భాగం పనులను ‘భారత్ మాల’ కార్యక్రమంలో మంజూరు చేసింది. భూసేకరణలో సమస్యల కారణంగా ఇంతకాలం జాప్యం జరగ్గా, ఇటీవలే ఉత్తర భాగం పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. డీపీఆర్ రూపకల్పన సందర్భంగా ఉత్తర భాగం పొడవు 158.65 నుంచి 161.5కి పెరిగింది. ఉత్తర భాగం పనులతోపాటే దక్షిణ భాగం పనులను కూడా పూర్తిచేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, వికసిత్ భారత్-2047లో చేపడతామని కేంద్రం ఆనాడే హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక దక్షిణ భాగం పనులను తామే చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీని ఏర్పాటుచేయడమే కాకుండా కన్సల్టెంటు ద్వారా మరో అలైన్‌మెంట్‌ను రూపొందించింది. కొత్త అలైన్‌మెంటు ప్రకారం పొడవు 189 కిలోమీటర్ల నుంచి 195కి పెరిగింది. ఈ అలైన్మెంట్ ప్రకారం రహదారి నిర్మాణంపై సీఎం అధ్యక్షతన పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. రహదారి వెళ్తున్న ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో సామాజిక ఆర్థిక సర్వేను కూడా నిర్వహించారు. భూసేకరణ సహా రహదారి నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలను రూపొందించారు. ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో రహదారిని నిర్మిస్తే.. భూసేకరణ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తే సరిపోతుంది. రహదారి నిర్మాణం పూర్తిగా కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్మిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తే ఖర్చు మొత్తం రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర సర్కారు ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం నిర్మించాలనే ఆలోచనను విరమించుకున్నది. అంతేకాదు, దక్షిణ భాగం పనులు త్వరలో చేపట్టాలని కేంద్రానికి లేఖ రాసింది.
త్వరగా దక్షిణభాగం పనులు చేపట్టాలని కోరుతున్న రాష్ట్రం.. ఇదే దక్షిణ భాగం కోసం డీపీఆర్ రూపకల్పనకు టెండర్లను ఆహ్వానించడంపై గందరగోళం నెలకొన్నది. ఎన్హెచ్ఏఐ చేపట్టిన ప్రాజక్టు కోసం అలైన్మెంట్ నుంచి డీపీఆర్‌ల తయారీ, టెండర్ల ప్రక్రియను అంతా ఆ సంస్థయే చూసుకుంటుంది. డీపీఆర్ ఖరారయ్యాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైనా అభ్యంతరాలున్నా, మార్పులు, చేర్పులు ఉన్నా సూచించవచ్చు. ఇక్కడ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే డీపీఆర్ రూపొందించడం వెనుక కారణం ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎన్హెచ్ఏఐ వద్ద మాత్రం ఇప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ముసాయిదా అలైన్మెంట్ మాత్రమే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మార్చిన అలైన్మెంట్ ఇంకా ఎన్హెచ్ఏఐకి చేరనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ రూపొందిస్తున్న విషయం కూడా తమకు తెలియని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ డీపీఆర్‌ను ఎన్హెచ్ఏఐ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందనేది కూడా తేలాల్సి ఉన్నది.