MLC Elections | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): వచ్చే యేడాది మార్చి, ఆగస్టు నెలల్లో శాసనమండలిలో తొమ్మిది స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో ఐదు ఎమ్మెల్యే కోటా సీట్లుగా కాగా ఒకటి పట్టభద్రుల స్థానం, రెండు ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. కాగా పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి ప్రస్తుతం జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు ఉపాధ్యాయ స్థానాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నుంచి రఘోత్తంరెడ్డి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానంనుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీకాలం వచ్చే మార్చి 29తో ముగియనుంది. ఈ మూడు స్థానాలతోపాటు ఎమ్మెల్యేల కోటా నుంచి 5 స్థానాలు, హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి మరో స్థానానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి.
ఓటర్ల జాబితాపై కసరత్తు
ఉపాధ్యాయ స్థానాలకు ఓటర్ల జాబితాను రూపొందించే పని ప్రారంభమైంది. నవంబర్ ఒకటో తేదీని కటాఫ్ (క్వాలిఫైయింగ్) డేట్‌గా పెట్టుకుని ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది.
ఎమ్మెల్యే కోటాలో
రాష్ట్ర శాసనమండలిలో మొత్తం 40 సీట్లు ఉండగా ఇందులో ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా నుంచి 14 మంది చొప్పున, పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల నుంచి మూడు చొప్పున ఉన్నాయి. ఆరుగురు సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ఐదుగురి పదవీ కాలం కూడా వచ్చే మార్చి 29తో ముగియనున్నది. వీరిలో యెగ్గె మల్లేశం, మీర్జా రియాజ్ ఉల్ హసన్, సత్యవతి రాతోడ్, శేరి సుభాష్‌రెడ్డి, మహమూద్ అలీ ఉన్నారు. అలాగే హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎస్ ప్రభాకర్‌రావు పదవీ కాలం ఆగస్టు 6వ తేదీతో ముగియనున్నది.