TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మలక్కా జలసంధిలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం ఉదయం 8.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తర్వాతి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం సైతం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పొడి వాతావరణం ఉంటుందని వివరించింది.