హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రస్తుత ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులు ఆందోళన వ్యక్తంచేశారు. ‘ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ’ అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ సంపాదకులు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. తమ హోదాను మరిచిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
ఇటీవల సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేశారు. నలభై ఏండ్ల అనుభవం ఉన్న సీఎం చంద్రబాబునాయుడు కూడా దిగజారి ప్రవర్తించడం దారుణమని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యులతో జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం ఆయన బుద్ధిహీనతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వాలకు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేయని జర్నలిస్టులను రెండు తెలుగు రాష్ర్టాల్లో వేధింపులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆది నుంచీ జర్నలిస్టులను అణచివేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులంతా ఏకమై అలాంటి శక్తుల కుయుక్తులను పటాపంచలు చేసేందుకు పటిష్ఠ కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం శుభపరిణామమని హర్షం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్రను గుర్తించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ, రామచంద్రమూర్తి, కే శ్రీనివాస్, దిలీప్‌రెడ్డి, విజయ్‌బాబు, శైలేష్‌రెడ్డి, ఆర్ ధనుంజయ్‌రెడ్డి, టంకశాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై అన్యాయాన్ని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు : రెహమాన్
ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న పెద్ద ధన్వాడ బాధిత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని సీనియర్ జర్నలిస్టు రెహమాన్ చెప్పారు. ప్రభుత్వం రైతుల భూములు లాక్కొనేందుకు బౌన్సర్లు, గూండాలతో రైతులను కొట్టించిందని ఆరోపించారు. అమాయక రైతులపై సర్కారు అకృత్యాలు సమాజానికి తెలియజేయడం జర్నలిస్టుగా తన కర్తవ్యమని స్పష్టం చేశారు. రైతులు ఆందోళనలు చేపట్టిన ప్రాంతంలో తాను లేకున్నా అక్రమంగా కేసులు పెట్టడం కాంగ్రెస్ సర్కార్ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై వార్తలు రాస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వ అరాచకాలను వెలుగులోకి తెస్తూ ప్రజలకు అండగా ఉంటామని అన్నారు.