కొల్చారం, జూన్ 3 : గుండెపోటుతో నవ వరుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసానిపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం .. గ్రామానికి చెందిన లక్కమ్మొల్ల పెద్ద వెంకట్ కుమారుడు సాయికిరణ్(19)కు మే 21న అంసానిపల్లికి చెందిన గొల్పల శేఖర్, రుక్కమ్మ కూతురు అనూషతో వివాహం జరిగింది. సాయికిరణ్ సోమవారం రాత్రి ఓ వివాహానికి బ్యాండు వాయించడానికి వెళ్లి మరునాడు ఉదయం ఇంటికి వచ్చాడు. స్నానం చేయడానికి వెళ్లి ఒక్కసారిగా బాత్రూమ్ లో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు గ మనించేసరికి మరణించాడు. వివాహం జరిగిన 14 రోజులకే భర్త మరణించడంతో అనూష రోదన లు మిన్నంటాయి. అనూష తండ్రి రెండున్నర ఏండ్ల క్రితం మరణించగా, అన్న సైతం రోడ్డు ప్ర మాదంలో మృతిచెందారు. ఇప్పుడు భర్త మరణంతో అనూష పుట్టెడు దు:ఖంలో ఉంది. అనూష ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో గ్రామస్థులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు.