హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు కల్లోలం సృష్టిస్తున్నాయి. వాటి ఏర్పాటులో అధిష్ఠానం వ్యవహరించిన తీరుపై మెజార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంకితభావంతో కాంగ్రెస్‌కు సేవ చేస్తున్నవారిని కాదని నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి, జూనియర్లకు ప్రధాన కమిటీల్లో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ కొత్త కమిటీల స్వరూపంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తనకు స్థానం కల్పించిన ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. అనంతరం ఆమె తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఎంతో రాజకీయ అనుభవం గల తనకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు కల్పించకపోవడంపై సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనకు స్థానం కల్పించడమేంటని ప్రశ్నించారు. పోలిటికల్ కమిటీలో స్థానం కల్పించకపోవడం తనను అవమానించడమేనన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనకు స్థానం అవసరం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
వరంగల్ జిల్లా నుంచి ఒక్క నేతకు కూడా పోలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు కల్పించకపోవడంపై ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవనివారికి, నిన్న మొన్న పార్టీలోకి వచ్చినవారికి, రాజకీయమంటే ఏమిటో తెలియనివారికి స్థానం కల్పించారని ధ్వజమెత్తారు. పార్టీ నియమించిన ఏ ఒక్క కమిటీలోనూ తనకు స్థానం దక్కకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. మంత్రి పదవినే వదిలేసిన తనకు పార్టీ పదవులు లెక్క కాదని చెప్పారు.