పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థలో ఇటీవల రూ.కోటికిపైగా నిధులు వెచ్చించి కొనుగోలు చేసి మూలకు పెట్టిన వాహనాలకు మంగళవారం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు. నగర పాలక కార్యాలయం ఆవరణలో గల ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు, బాడీ ఫ్రీజర్లకు నల్లబ్యాడ్జీలు కట్టి పూజలు చేసి అధికారులు, ప్రజాప్రతినిధుల వైఖరిని ఎండగట్టారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీలు) భద్రాచలం ఐటీడీఏ ఎదుట చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి పదకొండవ రోజుకు చేరింది. దీక్షలో భాగంగా ఉపాధ్యాయులు మోకాళ్లపై సీతారామచంద్రస్వామి ఆలయ మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించేలా సీఎం రేవంత్‌రెడ్డికి స్పృహ కలిగేలా చూడాలని వేడుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె 22వ రోజుకు చేరింది. మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని పాత కలెక్టరేట్ నుంచి పోలీస్‌స్టేషన్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం చీపుర్లు పట్టి రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలను తీవ్రం చేస్తామని ఎస్ఎస్ఏలు హెచ్చరించారు.